అన్ని రాష్ట్రాల‌ను అడిగే చేస్తున్నారా జైట్లీ?

Update: 2017-12-20 05:37 GMT
మోడీ బ్యాచ్ తెలివితేట‌లు అన్నిఇన్ని కావు. అవ‌స‌రానికి అనుగుణంగా వారి మాట‌లు ఇట్టే మారిపోతుంటాయి. కేంద్ర.. రాష్ట్ర సంబంధాల విష‌యంలో స‌మాఖ్య స్ఫూర్తికి తిలోద‌కాలు ఇవ్వ‌టంలో మోడీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని అధికారం పుణ్య‌మా అని రాష్ట్రాల్ని ప‌ట్టించుకోవ‌ట‌మే మానేశారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవ‌టం లాంటివి అస్స‌లు క‌నిపించ‌వు. రాష్ట్రాల దాకా ఎందుకు.. ఎన్నిక‌ల వేళ‌లో త‌మ‌తో ఉన్న మిత్ర‌ప‌క్షాల్నే వ‌దిలేసిన మోడీకి.. రాష్ట్రాలు ఏపాటివి?

ఇటీవ‌ల కాలంలో పెట్రోలియం ఉత్ప‌త్తులు జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. జీఎస్టీలో గ‌రిష్ఠంగా ప‌న్ను ప‌రిధి 28 శాతం. ప్ర‌స్తుతం పెట్రోలియం ఉత్ప‌త్తుల మీద భారీగా ప‌న్ను విధిస్తున్న వైనం తెలిసిందే. ఒక‌వేళ పెట్రోలియం ఉత్ప‌త్తుల్ని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొస్తే.. కేంద్రంతో పాటు రాష్ట్రాలు భారీ ఆదాయాన్ని కోల్పోతాయి.

అయితే.. పెట్రో ఉత్ప‌త్తుల్ని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌న్న డిమాండ్ కేంద్రానికే ప‌రిమితం కావ‌టం.. మోడీ స‌ర్కారు మీద ఒత్తిడి అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. త‌మ‌పై ప‌డుతున్న ఒత్తిడిని రాష్ట్రాల‌కు బ‌దిలీ చేయ‌టానికి కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గ‌డిచిన కొన్ని నెల‌లుగా పెట్రోలియం ఉత్ప‌త్తుల్ని జీఎస్టీలోకి చేర్చాల‌న్న అంశంపై మాట్లాడ‌ని జైట్లీ.. తాజాగా రాజ్య‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌తో స‌మాధానం ఇచ్చారు.

అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌ల త‌గ్గుద‌ల‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ఇంధ‌న రేట్లు ఎందుకు త‌గ్గ‌లేద‌న్న చిదంబ‌రం ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. అన్ని తెలిసిన వ్య‌క్తే ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం గ‌మ్మ‌త్తుగా ఉందంటూ చుర‌క అంటించే ప్ర‌య‌త్నం చేశారు.

యూపీఏ హ‌యాంలో రూపొందించిన ముసాయిదా బిల్లులోనే పెట్రోల్‌.. డీజిల్ ను జీఎస్టీ ప‌రిధి నుంచి త‌ప్పించార‌ని గుర్తు చేసిన ఆయ‌న‌..  పెట్రోల్‌ ను జీఎస్టీలోకి తీసుకొస్తే ఈ చ‌ట్టం అమ‌లు విష‌యంలో కేంద్రం.. రాష్ట్రాల మ‌ధ్య అంగీకారం కుద‌ర‌ద‌నే ఉద్దేశంతోనే నాడు జీఎస్టీ నుంచి త‌ప్పించార‌ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చేయాల్సింది చేసి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మార్చుకోవాల‌న్న మాట చెప్ప‌టం ఏమిటంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

నిజ‌మే.. జైట్లీ మాట్లాడిన దాన్లో నిజం లేక‌పోలేదు. కానీ.. యూపీఏ పీక‌లేనిదేదో మోడీ సాబ్ పీకుతార‌న్న ఉద్దేశంతోనే యావ‌త్ దేశం  అధికారాన్ని వారి చేతుల్లో పెట్టిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. జీఎస్టీ అమ‌లు త‌మ ఖాతాలో వేసుకున్న మోడీ బ్యాచ్‌.. అది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అన్న విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించ‌టం చూస్తే.. క‌ష్టం వ‌స్తే ఎదుటోళ్ల ఖాతాలోకి.. అన్ని బాగుంటే క్రెడిట్‌ ను త‌మ ఖాతాలోకి వేసుకునే తీరు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంని చెప్ప‌క త‌ప్ప‌దు.

పెట్రోలు.. డీజిల్ ఉత్ప‌త్తుల ధ‌రలు త‌గ్గ‌క‌పోవ‌టం వెనుక కార‌ణంపై జైట్లీ వివ‌ర‌ణ ఇస్తూ.. వీటిపై వ‌చ్చే ప‌న్నుల వాటా రాష్ట్రాల‌కే అధికంగా ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే కేంద్రం సూచ‌న మేర‌కు కొన్ని రాష్ట్రాలు ప‌న్నులు త‌గ్గించాయ‌ని.. యూపీఏ అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు త‌గ్గించ‌లేద‌న్న పంచ్ ఇచ్చారు.చిదంబ‌రం వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చే క్ర‌మంలో ప్ర‌శ్న అడిగినోడికి పంచ్ ఇచ్చే సాదాసీదా రాజ‌కీయ నేత జైట్లీలో క‌నిపిస్తారు. రాష్ట్రాలు ఒప్పుకోని కార‌ణంగానే తాము ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని చెప్పే జైట్లీకి.. ఈ రోజు దేశంలో అత్య‌ధిక రాష్ట్రాల్లో అధికారం ఉంది మోడీ.. వారి మిత్రులే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అలాంట‌ప్పుడు మిత్రుల‌ను ఒప్పించి.. తాము ప‌వ‌ర్ లో ఉన్న రాష్ట్రాల ముఖ్య‌మంత్రులకు స‌ర్దిచెప్పి నిర్ణ‌యం తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు నో చెబుతాయా? ఒక‌వేళ చెబితే.. తాము చేసిన ప్ర‌య‌త్నం చెప్పి.. త‌మ‌కు అండ‌గా నిల‌వ‌ని రాష్ట్రాల గురించి కేంద్రం చెబితే.. వారి సంగ‌తి ప్ర‌జ‌లే తీసుకుంటారు క‌దా?

అయినా.. ఏ రోజు రాష్ట్రాలు.. వాటి ప్ర‌యోజ‌నాల గురించి  మోడీ స‌ర్కారు ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు?  వెనుకా ముందు చూడ‌కుండా మెరుపు నిర్ణ‌యాలు తీసుకునే మోడీ స‌ర్కారు.. దేశ ప్ర‌జ‌ల మీద భారీగా ప‌డుతున్న పెట్రోలియం ఉత్ప‌త్తుల ప‌న్నుభారాన్ని త‌గ్గించేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు క‌దా. ఈ రోజు రాష్ట్రాలు క‌లిసి రావ‌టం లేద‌న్న‌ట్లు చెబుతున్న జైట్లీకి.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. తాము ప‌వ‌ర్లోకి వ‌స్తే చాలు పెట్రోల్‌.. డీజిల్ రేట్లు భారీగా త‌గ్గిపోతాయ‌ని హామీ ఇచ్చిన‌ప్పుడు ఇప్పుడు చెప్పే మాట‌లు తెలీవా?  వినే వారు ఉండాలే కానీ చెప్పేటోళ్లు చెల‌రేగిపోతారంటే ఇదే.


Tags:    

Similar News