ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్ట‌ర‌ట‌

Update: 2016-11-02 05:50 GMT
యూకేకు చెందిన ప్ర‌ముఖ వాహ‌నాల కంపెనీ రోల్స్ రాయిస్ త‌న అవ‌స‌రాల రీత్యా లంచాలు ఇచ్చింద‌నే  వార్త క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను దుమారం రేపిన ఈ ప‌రిణామంపై కేంద్ర ప్ర‌భుత్వం కూల్ గా స్పందించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. గార్డియ‌న్‌ - బీబీసీ సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌ లో ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్ శిక్ష‌ణ కోసం ఉప‌యోగించే హాక్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల ఇంజిన్ల త‌యారీ కాంట్రాక్టు కోసం ఓ ఏజెంట్‌ కు రోల్స్‌ రాయిస్ కోటి పౌండ్ల (సుమారు రూ.82 కోట్లు) ముడుపులు చెల్లించిన‌ట్లు తేలిన విష‌యం తెలిసిందే. ఈ అక్ర‌మ చెల్లింపులే రోల్స్ రాయిస్‌ కు వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే కాంట్రాక్టును ఇచ్చాయ‌ని నిరూపించే కొన్ని విలువైన ప‌త్రాలు గార్డియ‌న్‌ - బీబీసీ సంయుక్త విచార‌ణ బ‌య‌ట‌పెట్టింది. అయితే ఈ ప‌రిణామం జ‌రిగిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య కింద‌ రోల్స్ రాయిస్‌ ను బ్లాక్ లిస్ట్‌ లో పెట్టే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

రోల్స్ రాయిస్‌ కు చెందిన అవినీతి బాగోతం తాలుకు సీక్రెట్ ఆప‌రేష‌న్‌ కు సంబంధించిన కార్య‌క్ర‌మాన్ని బీబీసీ త‌న ప‌నోర‌మ ప్రోగ్రామ్‌ లో టెలికాస్ట్ చేసింది. ఇందులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం రోల్స్ రాయిస్ నుంచి భారీగా ముడుపులు అందుకున్న వ్య‌క్తి ఆర్మ్స్ డీల‌ర్ సుధీర్ చౌద‌రిగా బీబీసీ వెల్ల‌డించింది. లండ‌న్‌లో సెటిలైన ఈ వ్య‌క్తిని భార‌త ప్ర‌భుత్వం బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టింది. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రోల్స్ రాయిస్‌ను మాత్రం త‌మ కొనుగోలు జాబితాలోనే ఉంచే అవ‌కాశం ఉంద‌ని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలాఉండ‌గా త‌మ క్లైంట్ ఎలాంటి ముడుపులు తీసుకోలేద‌ని సుధీర్ త‌ర‌ఫు లాయ‌ర్ అన్నారు. ఈ ముడుపుల బాగోతంపై స్పందించ‌డానికి రోల్స్ రాయిస్ కూడా నిరాక‌రించింది. ఈ విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స్పందించ‌డం స‌రికాదని రోల్స్ రాయిస్ సంస్థ అధికార ప్ర‌తినిధి ఒక‌రు వ్యాఖ్యానించారు. బీబీసీ వెలువ‌రించిన క‌థ‌నం ప్ర‌కారం రోల్స్ రాయిస్ ఇండియా స‌హా 12 దేశాల్లో ఇలా ఏజెంట్ల‌ను నియ‌మించుకుంద‌ని బీబీసీ తెలిపింది. లేబ‌ర్‌ - క‌న్జ‌ర్వేటివ్ పార్టీల్లో ఉన్న కీల‌క నేత‌లకు కూడా రోల్స్ రాయిస్‌ తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని - వాళ్లు త‌రుచూ విదేశీ ప్ర‌భుత్వాల‌తో కాంట్రాక్టులు రోల్స్ రాయిస్‌ కే ద‌క్కేలా లాబీయింగ్ చేశార‌ని బీబీసీ రిపోర్ట్ వెల్ల‌డించింది. రోల్స్ రాయిస్‌ పై విచార‌ణ ఇప్పుడు కొంద‌రు మంత్రుల‌ను కూడా చిక్కుల్లో ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆ రిపోర్ట్ తేల్చిచెప్పింది. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయంతో జ‌రిగిన ఈ ముడుపులు, అవినీతి వ్య‌వ‌హారంపై సీరియ‌స్ ఫ్రాండ్ ఆఫీస్ (ఎస్ ఎఫ్‌ వో)తోపాటు ఇత‌ర విచార‌ణ సంస్థ‌లు విచార‌ణ జ‌రుపుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News