చివ‌ర్లోనూ అంత కక్క‌ర్తి అవ‌స‌ర‌మా?

Update: 2019-05-07 05:19 GMT
ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు కుడి..ఏడంగా.. కాస్త అటూఇటూగా చేసిన స‌ర్దుకోవ‌చ్చు. కానీ.. పాల‌న మ‌రికొద్ది రోజుల్లో ముగుస్తున్న వేళ‌.. క‌క్కుర్తి నిర్ణ‌యాలు లేనిపోని చిక్కుల్లో ప‌డేస్తాయ‌న్న ఆలోచ‌న లేని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఉన్న‌తాధికారులు కొంద‌రు తీసుకుంటున్న నిర్ణ‌యాలు రూల్స్ కు భిన్నంగా ఉంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. బ‌రితెగింపుతో వారు వెనుకా ముందు చూసుకోకుండా తెస్తున్న ఒత్తిళ్లు చూసి విస్మ‌యానికి గురి అవుతున్న వైనం ఉన్న‌తాధికారుల్లో నెల‌కొంటోంది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ ప్ర‌జాప్ర‌తినిధులు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌రు. అయితే.. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధి ఫారిన్ వెళ్లాల‌నుకున్నారు. అధికార ప‌ర్య‌ట‌న కావ‌టంతో.. ప్ర‌భుత్వం దాని ఖ‌ర్చు భ‌రించాల‌న్న‌ది ఆయ‌న మాట‌. అయితే.. కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. ఇలాంటి టూర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌రు.. ఇచ్చినా దానికో ప్రాసెస్ ఉంటుంది. రేపొద్దున ప‌వ‌ర్ కానీ చేతులు మారితే.. ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

కానీ.. ఇవేమీ ప‌ట్ట‌ని స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి.. కిందిస్థాయి అధికారుల మీద ఒత్తిడి తెస్తే.. వారేమో ఉన్న‌త స్థాయి అధికారుల‌కు అబ్లిగేష‌న్ పేరుతో తెగ ఇబ్బంది పెట్టేస్తున్నార‌ట‌. ఇలాంటివి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. లేనిపోని తిప్ప‌లు ఖాయ‌మ‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నా.. స‌ద‌రు అధికారి స‌సేమిరా అంటున్నార‌ట‌. దీంతో ఒళ్లు మండిన ఉన్న‌తాధికారి ఒక‌రు.. అయితే.. రాత‌పూర్వ‌కంగా రాసి.. ఫైల్ ఫుట‌ప్ చేసి పంప‌మంటే.. స‌ద‌రు అధికారి ఇంకేమీ ఆలోచించ‌కుండా నోట్ రాసి పంపిన వైనం ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది.

వాస్త‌వానికి స‌ద‌రు అధికారి రాత‌పూర్వ‌కంగా రాసి పంపినా.. స‌ద‌రు ఫైల్ కు సీఎం అనుమ‌తి అవ‌స‌రమ‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సీఎం ఓకే చెప్పే ఛాన్స్ లేద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. నోట్ పంపిన స‌ద‌రు అధికారికి త‌ర్వాత రోజుల్లో తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు. కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. ఒక ప్ర‌భుత్వ కాల‌ప‌రిమితి చివ‌ర్లో ఉన్న‌ప్పుడు.. ఇలాంటి సిఫార్సులు కొత్త చిక్కుల్లో ప‌డేస్తాయంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అలాంటివేమీ ఆలోచించ‌కుండా సిఫార్సులు చేస్తున్న అధికారులు తీరు ఇప్పుడు విస్మ‌యానికి గురి చేస్తోంది.
Tags:    

Similar News