ఏపీలో ప్రభుత్వం నిజంగానే మారనుందా..?

Update: 2019-04-16 07:42 GMT
దాదాపు ఏడాది నుంచి ఎన్నికల కోసం వేచి చూసిన ప్రజలు మొత్తానికి ఈనెల 11న ఓట్లు వేశారు. తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎంతో కష్టపడి అర్ధరాత్రి వరకు పోలింగ్‌ లో పాల్గొన్నారు. ఈవీఎంలో తమ నిర్ణయాన్ని భద్రపరిచిన ప్రజలు అవి చెప్పే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల రిజల్ట్‌కు ఇంకా 38 రోజులు ఉండడంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రభుత్వమే గెలుస్తుందని ఎవరికి వారే సంకేతాలిస్తున్నారు. ఫలితాల సంగతి ఎలాగున్నా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చల వేడి రోజురోజుకు తీవ్రమవుతోంది.

ఎన్నికల పోలింగ్‌ పూర్తవగానే మరుసటిరోజు అధికార పార్టీ నేత - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్‌ మీట్‌ పెట్టి తమ ఫ్రభుత్వానిదే విజయం అని చెప్పారు. ఎన్నికలకు ముందు 150 వరకు సీట్లు వస్తాయన్న బాబు - పోలింగ్‌ తరువాత 120కి పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.

ఇక వైసీపీ నేతలు ఈసారి కచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారని - జగన్‌ సీఎం కాబోతున్నాడని ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలు సైతం జగన్‌ కు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంతో ప్రజల్లో చర్చ తీవ్రంగా సాగుతోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీతో ప్రజలు విసిగి పోయారని - దీంతో ప్రజల్లో సైతం జగన్‌ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారని కొందరు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు.

ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల్లోనూ రెండు వర్గాలుగా విడిపోయారన్న టాక్‌ వినిపిస్తోంది. కొందరు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తోందని హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇన్నిరోజులు పదోన్నతులు రానివారు ప్రభుత్వం మారితే తమకు తప్పకుండా ప్రమోషన్లు వస్తాయని ధీమాతో ఉన్నారు. ఇక కొందరైతే ఇప్పటి నుంచే వైసీపీ అధినేత జగన్‌ ను కలిసి తమ పదోన్నతుల గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఆపద్దర్మంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో మంత్రులు ఏదైనా పని కోసం ఫోన్‌ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

తాజాగా మంత్రులు - ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ ఉండడంతో తమ పనులు చేసిపెట్టాల్సిందిగా సంబంధిత అధికారులను పురమాయిస్తుంటే వారు అస్సలు చేయడం లేదట.. పనులు చేయకపోగా మంత్రులు - ఎమ్మెల్యేల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.. మే 23తో టీడీపీ పని ఖతం అవుతుందని.. మీరు చెప్పిన పనులు చేయాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంటున్నారట.. ఇంకొందరు సీఎం చంద్రబాబుపై విమర్శలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం నిజంగానే మార్పు దిశగా వెళ్తోందా.. అనే చర్చ జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News