బిట్ కాయిన్‌..మ‌న‌కు కేంద్రం హెచ్చ‌రిక ఇదే

Update: 2017-12-29 08:31 GMT
ఇంటర్నెట్‌ పై కాస్త అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రి నోటా విన్నా...బిట్ కాయిన్ అనే ప‌దం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. తెలియ‌ని వాళ్లు తెలుసుకోవాల‌ని....తెలుసుకున్న వాళ్లు దీనిలోని అవ‌కాశాల‌ను ఒడిసిప‌ట్టుకోవాల‌ని! ఎందుకంటే... బిట్‌ కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు రోజు రోజుకూ దూసుకెళ్లుతున్నాయి. ఆన్‌లైన్ ట్రేడింగ్ మార్కెట్‌ లో డిజిటల్ కరెన్సీలు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంత కాదు. ఈ నేప‌థ్యంలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. వర్చువల్ కరెన్సీలు మోసపూరిత స్కీమ్‌ లని ఆర్థిక శాఖ హెచ్చరించింది. కస్టమర్ల అలాంటి స్కీమ్‌ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

భార‌తీయుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఉద్దేశించిన ఈ ప్ర‌క‌ట‌న‌లో వర్చువల్ కరెన్సీలు ఇటీవల అనూహ్య రీతిలో దూసుకువెళ్తున్నాయని ఆర్థిక శాఖ వివరించింది. బిట్‌ కాయిన్ - ఇతర డిజిటల్ కరెన్సీలు దూసుకెళ్లుతున్న తీరు కేవలం ఊహాజనితం మాత్రమే అని ప్రభుత్వం తెలిపింది. బిట్‌ కాయిన్ బుడగ ఒక్కసారిగా పేలుతుందని, దాని వల్ల ఇన్వెస్టర్లు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. భారత్‌ తో పాటు ఇతర దేశాల్లోనూ బిట్‌ కాయిన్ శరవేగంగా పరుగెడుతున్నదని - వర్చువల్ కరెన్సీలకు స్వాభావికమైన విలువ లేదని - వాటికి ఎటువంటి బ్యాకప్ కూడా ఉండదని ఆర్థికశాఖ పేర్కొంది. మరీ ముఖ్యంగా రిటేల్ కస్టమర్లు తమ సంపాదనను కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. ఇలాంటి పాంజీ స్కీమ్‌ ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వాటి ఉచ్చులో పడరాదని హెచ్చరించింది.  వర్చువల్ కరెన్సీ డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉండడం వల్ల అవి హ్యాకింగ్‌ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పాస్‌ వర్డులు చోరీ అయినా - మాల్‌ వేర్ దాడి చేసినా.. వర్చువల్ పెట్టుబడులు కుప్పకూలిపోతాయని ఆర్థికశాఖ హెచ్చ‌రించింది.

మ‌రోవైపు ప‌టిష్ట‌మైన  టెక్నాల‌జీ అనే పేరున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీ రూపంలో ఆన్‌ లైన్‌ లో దాచిన డబ్బును అక్రమ కార్యకలాపాలకు వాడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. ఉగ్ర నిధులు - స్మగ్లింగ్ - డ్రగ్ ట్రాఫిక్కింగ్ - ఇతర మనీ ల్యాండరింగ్ లాంటి నేరాలకు కూడా వర్చువల్ కరెన్సీని సులువుగా వాడే ప్రమాదం ఉందని ప్రభుత్వం తెలిపింది.  అంతేకాకుండా...వర్చువల్ కరెన్సీకి ప్రభుత్వం ఎటువంటి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటనలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీ లీగల్ లావాదేవీ కాదు అని, వాస్తవానికి అవి కరెన్సీలు కానీ మూలంగా వాటిని నాణాలుగా వర్ణించలేమని ప్రభుత్వం వెల్లడించింది. ఆన్‌లైన్ నాణాలకు భౌతిక రూపం లేని కారణంగా అవి కరెన్సీ గాను - నాణంగానూ గుర్తించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రేడింగ్ కోసం వర్చువల్ కరెన్సీని భారత ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఇండియా కానీ గుర్తించలేదు అని ప్రభుత్వం తెలిపింది.

ఈ సంద‌ర్భంగా అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను కూడా వెల్ల‌డించింది. వర్చువల్ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే ఎక్స్‌ చేంజీలకు కూడా ప్రభుత్వం లైసెన్సు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వర్చువల్ కరెన్సీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్లు వాడే యూజర్లకు - హోల్డర్లకు - ట్రేడర్లకు గతంలో మూడుసార్లు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. బిట్‌ కాయిన్‌ లేదా వర్చువల్ కరెన్సీ ఆపరేట్ చేయాలంటూ ఆర్బీఐ ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదని ప్రభుత్వం మరీమరీ స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీ లీగల్ టెండర్ కాదు అని ప్రభుత్వం పేర్కొన్నది. ఆ కరెన్సీకి దూరంగా ఉండడం మంచిదని ప్రభుత్వం సూచించింది. త‌ద్వారా వినియోగ‌దారుల‌కు సూచ‌న‌లు - హెచ్చ‌రిక‌లు జారీచేసింది.
Tags:    

Similar News