జీపీఎఫ్ మాయంపై ప్ర‌భుత్వం ఇలా.. ఉద్యోగులు అలా!

Update: 2022-06-30 03:15 GMT
ఆంధ్ర‌ప్రదేశ్ లో 90 వేల మంది ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయ‌మైన అంశం ఉద్యోగుల్లో కలకలం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల నేత‌లు జూన్ 29న ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌ను క‌లిశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌లో నిధులు క్రెడిట్, డెబిట్‌ కావడానికి సాంకేతిక సమస్యే కారణమై ఉండొచ్చ‌ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపార‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెబుతున్నారు.

జూన్ 29న ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ ఉన్న‌త అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు జీపీఎఫ్‌లో డబ్బు మాయంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని అధికారుల దృష్టికి తెచ్చారు.

ట్రెజరీ, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా బిల్లులు పాస్‌ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్లే జీపీఎఫ్ నిధుల డెబిట్ కావ‌డంలో సమస్య వ‌చ్చింద‌ని అధికారులు ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు తెలిపారు. 2018 జూలై 1 నుంచి రావాల్సిన డీఏ ఎరియర్స్‌ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్‌ కావడం ప్రభుత్వ తప్పిదం కాదని అధికారులు అంటున్నారు. సాంకేతికంగా ఏం జరిగిందన్నదానిపై అధికారులు తెలుసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు నేత‌లు చెబుతున్నారు. కాగా జూలై నెలాఖరు లోపు జీపీఎఫ్, మొత్తం డీఏ బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని అంటున్నారు.

జీపీఎఫ్‌లో డబ్బు క్రెడిట్, డెబిట్‌ను ప్ర‌భుత్వం ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు కూడా అంటున్నారు. సీపీఎస్, ఓపీఎస్‌ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో జీపీఎఫ్ న‌గ‌దు డెబిట్ స‌మ‌స్య ఏర్పడిందని చెబుతున్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి.. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారంటున్నారు.

అయితే.. టెక్నికల్ సమస్య ఏమైనా ఉందేమో తెలుసుకుంటామని చెప్పడంతో ఉద్యోగులు ఏదో తేడా జరుగుతోందన్న అనుమానంలో ఉన్నారని అంటున్నారు. మ‌రోవైపు జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయం కావ‌డంపై ఆర్థికశాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని మ‌రో ఉద్యోగ సంఘం నేత సూర్య నారాయ‌ణ చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. జీపీఎఫ్ నిధులు మాయం కావ‌డం వెనుక సాంకేతిక స‌మ‌స్యే కార‌ణ‌మైతే.. పొరపాట్లు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవని సూర్య‌నారాయ‌ణ ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా, అప్పుల లెక్కలు సరి చేసేందుకు ఇలా జీపీఎఫ్ సొమ్మును మళ్లిస్తున్నారని.. ఆడిట్ పూర్తయిన తర్వాత మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉద్యోగుల అకౌంట్లలో నగదు వారి అనుమతి లేకుండా తరలించడం చట్టవిరుద్ధమ‌ని చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News