వైసీపీ బిగ్ రిస్క్ : పట్టభద్రులతో పెట్టుకుంటే....?

Update: 2022-07-22 17:30 GMT
ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నయి. దాని కోసం ఏకంగా ఎనిమిది నెలల ముందే వైసీపీ అభ్యర్ధులను ప్రకటించేసింది. ఉత్తరాంధ్రా జిల్లాలకు సంబంధించి  ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్థానానికి ప్రస్తుత బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ సుధాకర్ పేరు ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు స్థానానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అభ్యర్ధిగా బరిలోకి దింపనున్నారు.కర్నూల్, కడప, అనంతపురం స్థానానికి  వెన్నపూస రవి పేరును ఖరారు చేసింది వైసీపీ.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ఎన్నికల పేరిట వైసీపీ బిగ్ రిస్క్ చేస్తోందా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఒటర్లు అంతా చదువరులు ఉంటారు. వీరిలో ఉడుకు రక్తం వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే యువత ఈ ఎన్నికల మీద ఆసక్తి చూపిస్తుంది.

ఇక యువత విషయం తీసుకుంటే వైసీపీ సర్కార్ మీద అసంతృప్తితో ఉందని అంటున్నారు. ప్రత్యెకా హోదా తెస్తాం, ఏపీలో పరిశ్రమలు వస్తాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయని యువభేరీల పేరిట జగన్ విప‌క్షంలో ఉన్నపుడు ఊదరగొట్టారు. తీరా ఇపుడు చూస్తే ప్రత్యేక హోదా ఊసే  అన్నది పూర్తిగా ఆయన మరచిపోయారు.

దాంతో యువత మండిపోతోంది. దానికి తోడు జాబ్ క్యాలండర్ ప్రతీ ఏటా రిలీజ్ చేస్తామని చెప్పి అది కూడా నెరవేర్చలేదు. ఏపీలో ఉపాధి అవకాశాలు లేవని యువతరం ఆగ్రహంగా ఉంది. దాంతో పట్టభద్రులే ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికలు వైసీపీకి పెను సవాల్ గా మారుతాయని అంటున్నారు.

అదే టైమ్ లో యువతలో ఉన్న వ్యతిరేకతను విపక్షాలు కచ్చితంగా తమను అనుకూలంగా మార్చుకుంటాయని అంటున్నారు. అదే జరిగితే సార్వత్రిక ఎన్నికలు ఏడాది ముందు జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖరారు అవుతుందని, దాని ప్రభావం కచ్చితంగా అసలైన ఎన్నికల మీద పడే ప్రమాదం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎపుడూ పోటీ చేయని పట్టభద్రుల ఎన్నికల విషయంలో అత్యుత్సాహం చూపించడం అంటే నిజంగా ఇది కోరి కొరివి పెట్టించుకోవడమే అని కూడా పార్టీలో వినిపిస్తున్న మాట. 2017తో పోలిస్త గ్రాడ్యుయేట్స్ బాగా పెరిగారని, ఓటర్లుగా వారందరి డేటా తీసుకుని ఓటర్లను నమోదు చేయించడం అతి పెద్ద యాగమని కూడా అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యతలను ఎమ్మెల్యేల  మీద పెడుతూండడంతో వారు కూడా ఇదేమిటి మాకు బాధ అని వాపోతున్నారుట.

ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్రా వంటి జిల్లాలలో వామపక్షాలు, బీజేపీ పట్టభద్రుల స్థానంలో బలంగా ఉన్నాయి. కౌన్సిల్ ని పునరుద్ధరించిన తరువాత రెండు సార్లు వామపక్షాల అభ్యర్దులు ఎమ్మెల్సీలుగా నెగ్గితే ఒకసారి బీజేపీ గెలిచింది. వీరి వద్ద డేటా మొత్తం ఉంటుదని, ఎలా గెలవాలో వారికి పక్కా ప్లాన్ కూడా ఉందని, ట్రెడిషనల్ పాలిటిక్స్ ఆ తరహా వ్యూహాలు ఇక్కడ చెల్లవని కూడా అంటున్నారు. మొత్తానికి పోయి పోయి  పట్టభద్రులతో వైసీపీ పెట్టుకుంటోందని రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఇబ్బందే అంటున్నారు
Tags:    

Similar News