13 వెయిట‌ర్ ఉద్యోగాలకి 4000 మంది డిగ్రీ ఉత్తీర్ణుల ద‌ర‌ఖాస్తు

Update: 2019-01-23 14:30 GMT
నిరుద్యోగ భారతం ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే ఉదాహ‌ర‌ణ ఇది. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు అధికమవుతోందనే చ‌ర్చ‌లోని వాస్త‌విక స్థితిని తేట‌తెల్లం చేసే ప‌రిస్థితి ఇది. మహారాష్ట్రలో క్యాంటీన్ల ముందు వేచి ఉండే వేయిటర్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అందులో మెజార్టీ గ్రాడ్యుయేట్లు కావ‌డం ప‌రిస్థితికి నిద‌ర్శ‌నం.

వివరాల్లోకెళ్తే.. ముంబయిలోని సెక్రటేరియట్‌ లో ఉండే క్యాంటీన్ల ముందు వేచి ఉండటానికి 13 మంది వేయిటర్‌ ల కోసం అధికారులు నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సదరు ఉద్యోగానికి నాలుగో తరగతిని విద్యార్హతగా నిర్ణయించగా.. దరఖాస్తు చేసుకున్నవారిలో సగానికంటే ఎక్కువ మంది పట్టభద్రులే కావడం ప్రస్తావనార్హం. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్పందిస్తూ.. మహారాష్ట్రలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పన క్షీణించిందని విమర్శించింది. బీజేపీ పాలనలో కొత్త సంస్థలు రాకపోగా.. పెద్దనోట్ల రద్దు - జీఎస్టీల కారణంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడాయని విమర్శించింది.

ఉద్యోగం దొరక్క చేశారో ..లేదా సెక్రటేరియట్‌ లో ఉద్యోగం అనుకుని చేశారో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాలుగో తరగతి పాస్ అయిన వాళ్లు అర్హులని నోటిఫికేషన్‌ లో తెలియజేశామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. వంద మార్కులతో కూడిన పరీక్షను నిర్వహించామని - తర్వాత సెలక్షన్ చేసిన 13 మందిలో 12 మంది గ్రాడ్యుయేషన్ చేయగా..ఒకరు మాత్రం ఇంటర్మీడియట్ చదివారని తెలిపారు. 25 నుంచి 27 ఏళ్ల వయసున్న 8 మంది అబ్బాయిలు - ఐదుగురు అమ్మాయిలను సెలక్ట్ చేసినట్టు తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ చేసిన వారు వెయిటర్ పోస్ట్‌ కు దరఖాస్తు చేసుకున్నారంటే..దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమౌతోందని కామెంట్స్ చేస్తున్నారు. నాలుగో తరగతి అర్హతకు ఇంతమంది చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడం బాధాకరమైన విషయమని.. గ్రాడ్యుయేషన్ చేసిన వారి చేతులతో టీ - బిస్కెట్లు అందిస్తే వాటిని మంత్రులు ఎలా తీసుకుంటారని కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు.



Full View

Tags:    

Similar News