గ్రేటర్ అభ్యర్థులు ఈసారి గ్రేటే

Update: 2016-01-26 10:25 GMT
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో పాత తరాన్ని తోసిరాజని కొత్తరక్తం రంగంలోకి దిగింది. బల్దియా ఎన్నికల పోరులో ఈ సారి 40 శాతం మంది ఉన్నత విద్యావంతులు పోటీకి దిగారు. మార్పు కోసం గళం విప్పుతూ విద్యావంతులకే ఓటేయాలని సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ టీఆర్‌ ఎస్‌ సహా ప్రతిపక్షపార్టీలు ఉన్నత విద్యావంతులను రంగంలోకి దించాయి.

'గ్రేటర్‌' అవకాశాన్ని అంది పుచ్చుకున్న యువ అభ్యర్ధులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ కుర్రకారు ఓట్లకు గాలం వేస్తున్నారు. ప్రత్యేకించి అధికార పార్టీ అభ్యర్థులుగా బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ బరిలో ఉన్న విజయారెడ్డిలతో పాటు మూసారాంబాగ్‌ నుంచి తీగల సునందారెడ్డి, ఆర్కేపురం నుంచి తీగల అనితారెడ్డి పోటీ చేస్తున్నారు. కవాడీగూడ నుంచి ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితతో పాటు మరెందరో విద్యావంతులు ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. దీంతో రానున్న గ్రేటర్‌ పాలనలో పట్టభద్రుల మార్కు కనిపించడం ఖాయమని స్పష్టమౌతోంది. ప్రచారంలోనూ యువ అభ్యర్ధులు ఎవరి వాదన వారు బలంగా విని పస్తున్నారు.

బంజారాహిల్సులో పోటీ చేస్తున్న గద్వాల విజయలక్ష్మి జర్నలిజం చదువుకున్నారు.  మరోవైపు ఎంటెక్‌ చదువుకున్న పి.జనార్థన్‌ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్ బరిలో ఉన్నారు.  ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలిచిన సునందరెడ్డి, అనితారెడ్డిలు కూడా ఉన్నత విద్యావంతులే.  మెట్టుగూడ నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీచేస్తున్న పీఎం భార్గవి ఎంబీఏ పూర్తిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సామల హేమ సీతాఫల్‌మండి అభ్యర్ధిగా పోటీకి దిగారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా అంతే స్థాయిలో పట్టభద్రులు పదవికోసం రేసులో నిలిచారు.  యూసుఫ్‌గూడ నుంచి పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి సురేందర్‌ యాదవ్‌ ఎంబీబీఎస్‌ చదివారు. జాంబాగ్‌ డివిజన్‌ నుంచి పోటీచేస్తున్న విక్రమ్‌గౌడ్‌ పీజీ వరకు చదువుకున్నారు.

మొత్తం గ్రేటర్‌ బరిలో పోటీకి దిగిన నలబై శాతం మంది పట్టభద్రుల్లో ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌, జర్నలిజం, బీఈడీ చదివిన అభ్యర్థులు దాదాపు 15 మంది ఉన్నారు. ఈ సారి రిజర్వేషన్‌ ఆలంబనగా రంగంలోకి దిగిన 50 శాతంమంది మహిళా అభ్యర్థుల్లో 35 మంది వరకు బాగా చదువుకున్నవారే కావడం విశేషం. కేవలం ప్రాథమిక విద్యను అభ్యసించిన వారు 10 నుంచి 20 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. పదోతరగతి చదివిన వారు దాదాపు 20 శాతం మంది ఉండగా.. ఇంటర్‌ విద్యనభ్యసించిన అభ్యర్ధులు మరో 15 శాతం వరకు ఉన్నారు. స్వతంత్రంగా బరిలోకి దిగిన వారిలోనూ అధికశాతం మంది డిగ్రీచేసినవారే ఉన్నారు.
Tags:    

Similar News