మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తుండడంతో ఏం జరుగుతుందోనని రాజకీయవర్గాలతోపాటు సామాన్య ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే.. పొత్తు పాతదే కానీ.. సీఎం మాత్రం కొత్తట.
మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలవనుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేకపోవడం గమనార్హం. ఇక్కడే పొత్తు పాతదే కానీ.. ముఖ్యమంత్రి మాత్రం కొత్త అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ కొత్త నేత మరెవరో కాదు నితిన్ గడ్కరీయేనట. నిజానికి.. శివసేనతో మొదటి నుంచీ గడ్కరీకి మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. మహా ఉత్కంఠకు తెరపడాలంటే.. గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ సూచించారట. దీనికి శివసేన కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ నేతలు బావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. దీనిపై ఫడ్నవిస్ ఎలా స్పందిస్తారన్నది అందరిలో మరో ఉత్కంఠను రేపుతోంది. నిజానికి.. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే.. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన కూడా ప్రయత్నాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత శరద్‌పవార్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన వి షయం తెలిసిందే. కానీ.. శివసేనతో కలిసి నడిస్తే వచ్చే నష్టాలను అంచనా వేసిన సోనియా గాంధీ శరద్‌పవార్ ప్రతిపాదనను తోసిపుచ్చడం గమనార్మం.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షంలోనే కూర్చొని నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని వారు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా.. బీజేపీ-శివసేన కూటమియే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే.. ముఖ్యమంత్రి విషయంలో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి మరి.