అమరావతి.. పచ్చని స్వర్గం

Update: 2015-07-24 03:31 GMT
నవ్యాంధ్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలాన్ని ఎంపిక చేయక ముందు ఈ ప్రాంతం గురించి తెలిసిన వారికి అదొక పచ్చని స్వర్గం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లే. 365 రోజులూ పంటలు పండే భూములే. వాటిలో నిరంతరం పంటలే. మధ్య మధ్యలో రంగురంగుల పూల తోటలు. దాంతో చాలా మందికి తెలియదు. కానీ ఈ ప్రాంతం ఒక నందనవనంగా ఉండేది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దిన తర్వాత కూడా ఈ ప్రాంతం పచ్చని స్వర్గంగానే కొనసాగనుంది.

అమరావతిలో అందమైన రోడ్లు, చక్కని పార్కులు, పూల తోటలు, నందన వనాలతో నయా రాజధాని రూపుదిద్దుకోనుంది. సీడ్ కేపిటల్లో పార్కులు, గ్రీనరీకి పెద్దపీట వేస్తున్నారు. ఇందుకు కేటాయించిన 4235 ఎకరాల్లో దాదాపు 20 శాతం భూమిని అంటే 777 ఎకరాలను కేవలం పార్కులు, హరితవనం ఏర్పాటుకు కేటాయించారు.

రాజధానిలో రోడ్ల నిర్మాణాలకు 670 ఎకరాలను కేటాయించారు. రాజధానిలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరొక 630 ఎకరాలను వదులుతారు. ఇక ప్రత్యేక అభివృద్ధి జోన్ కింద 530 ఎకరాలను కేటాయించారు.

దాదాపు 400 ఎకరాల్లో నివాస భవనాలను నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 120 ఎకరాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యుల నివాసాలను నిర్మిస్తారు. మధ్యతరగతి, సాధారణ స్థాయి నివాసాల కోసం మిగిలిన భూమిని వినియోగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం 150 ఎకరాలను కేటాయించారు.

వాణిజ్య అవసరాల కోసం 110 ఎకరాలు; బిజినెస్ పార్కుల కోసం వంద ఎకరాలు; తాగునీటి సరఫరాకు 175 ఎకరాలు; పాఠశాలలకు 35 ఎకరాలు; అంతర్గత రోడ్లకు 27 ఎకరాలను కేటాయించారు.


Tags:    

Similar News