ఫైజర్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ .. మొండిపట్టు వీడిన మోడీ ప్రభుత్వం !

Update: 2021-05-15 07:39 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే ,ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య మూడు లక్షల వరకు మాత్రమే ఉంది. కేసులు తగ్గుతున్నా కూడా మరణాలు మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కరోనా మరణాలు మూడున్నర నుంచి నాలుగు వేలకు తగ్గట్లేదు. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో  24 గంటల వ్యవధిలో కొత్తగా 3,26,098 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,890 మరణాలు నమోదు అయ్యాయి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల లోటు.. యాక్టివ్ కేసులకు అనుగుణంగా ఆక్సిజన్, పడకలు అందుబాటులో లేకపోవడం, రెమ్‌ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత వంటివి మరణాలు రేటు పెరగడానికి కారణమౌతోందనేది బహిరంగ రహస్యం.

ఈ పరిణామాలు ఇలా ఉంటే .. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిస్తోంది. మూడో దశ వ్యాక్సినేషన్‌ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినా కూడా దేశంలో టీకాల కొరత వెంటాడుతోంది. ఫలితంగా, అనేక రాష్ట్రాలు మూడోదశ కార్యక్రమాన్ని వాయిదా  వేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అదనంగా స్పుత్నిక్ వీ కూడా వచ్చి చేరింది. వచ్చే వారంలో ఈ స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి పూర్తిస్థాయిలో అనుమతించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి తోడు  అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌ను కూడా అనుమతి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి షరతులతో కూడిన నష్ట పరిహారాన్ని అందించడానికి కేంద్రం అంగీకరించిందని బిజినెస్ న్యూస్ పోర్టల్ ది ఎకనమిక్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.  అతి కొద్దిరోజుల్లోనే ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు వెల్లడించినట్లు ఓ కథనాన్ని ప్రసారం చేసింది. సాధరణంగా అయితే ఇప్పటికే  ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చి ఉండేదే.

భారత్ లో అత్యవసర వినియోగానికి మొట్టమొదట దరఖాస్తు చేసుకున్న సంస్థ ఫైజరే. అయితే, ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ  తో సమావేశం జరిగిన తర్వాత ఫైజర్ తమ దరఖాస్తును వెనక్కి  తీసుకుంది. ఫైజర్ సంస్థ గతేడాదే వ్యాక్సిన్ వినియోగం కోసం దరఖాస్తు చేసుకోగా, తక్కువ ధరకే డోసులు అందిస్తున్న ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్), దేశీయంగా తయారైన కొవాగ్జిన్ (భారత్ బయోటెక్-ఐసీఎంఆర్) ల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. స్థానికంగా కొద్దిసంఖ్యలోనైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా అనుమతులు ఇవ్వలేమని డీసీజీఐ ఫైజర్ కు  చెప్పడంతో , ఫైజర్ తన దరఖాస్తును వాపసు తీసుకుంది. అమెరికా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఫైజర్ టీకానే పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. మోడెర్నా సైతం వినియోగంలో ఉన్నప్పటికీ, మెజారిటీ వాటా ఫైజర్‌ దే. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇక మాస్కుల్లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చని కూడా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారంటే దాని సామర్థ్యంపై ఉన్న విశ్వాసమే.
Tags:    

Similar News