నవ్యాంధ్ర రాజధానికి హరిత హారం!

Update: 2015-07-09 17:30 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం రాజధాని నిర్మాణం తర్వాత కూడా పచ్చని స్వర్గంగానే అలరారనుంది. ఇందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో రెండు కోట్ల మొక్కలను నాటాలని సంకల్పం చెప్పుకొంది. రాజధానిని హరిత అమరావతిగా చేయనున్నారు. ఇందుకు ఏకంగా రూ.360 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో రాబోయే మూడు నాలుగేళ్లలో కోటిన్నర మొక్కలను నాటనుండగా వీటిలో అత్యధిక శాతం రాజధాని ప్రాంతంలోనే. ఈ మొక్కలన్నిటినీ కూడా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే తెప్పించనున్నారు. ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చారు. జిల్లాలోని కొండవీడు ప్రాంతాన్ని హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా అక్కడ భారీ సంఖ్యలో మొక్కలు నాటనున్నారు.

కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా గుంటూరు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ పది వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఆ తర్వాత రాబోయే నెల రోజుల్లో నవ్యాంధ్రలోని మొత్తం 13 జిల్లాల్లోనూ ప్రతి గ్రామంలోనూ మొక్కలను నాటాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు మొక్కలను నాటినా ఆ తర్వాత వాటి సంరక్షణ కరువైంది. వందలు, వేల కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. ఈసారి అలా కాకుండా మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News