ఇద్దరు ముఖ్యమంత్రుల కుటుంబాల గ్రూపు ఫోటో

Update: 2021-12-15 03:10 GMT
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర సీఎంను కలవటం సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.. అలా చేస్తే.. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అవుతారు? రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తాజాగా తన రెండు రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా.. కుటుంబ సమేతంగా దేవాలయాల్ని సందర్శించిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవటం తెలిసిందే.

అయితే.. ఈ భేటీ ఒక ఎత్తు అయితే.. తమ కుటుంబ సభ్యులు మొత్తాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి తీసుకెళ్లటం మరో ఎత్తు. అందరూ కలిసి గ్రూపు ఫోటో దిగటమే కాదు.. రెండు కుటుంబాల సభ్యులంతా ఒకే గదిలో కూర్చొని కాసేపు అలా మాట్లాడుకోవటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కేసీఆర్.. ఆయన సతీమణి.. కుమారుడు కేటీఆర్.. ఆయన సతీమణి శైలిమ.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. కుమార్తె అలేఖ్య.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లు ఉన్నారు. అదే సమయంలో స్టాలిన్ కుటుంబానికి సంబంధించి చూసినప్పుడు.. స్టాలిన్ ఆయన సతీమణి.. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ సతీమణి.. వారిద్దరి పిల్లలు మాత్రం ఈ గ్రూపు ఫోటోలో లేరు.

స్టాలిన్ ఇంట్లో దాదాపు గంట పది నిమిషాల పాటు గడిపిన సందర్భంలో.. సీఎం కేసీఆర్ తో మాట్లాడుతుంటే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ .. స్టాలిన్ కుమారుడు ఉదయనిధితో మాట్లాడటం కనిపించింది. అదే సమయంలో.. కేసీఆర్.. కేటీఆర్ సతీమణి.. స్టాలిన్ సతీమణితో మాట్లాడుకోవటం గమనార్హం. ఇలా.. అందరూ ఒకేచోట ఉన్నా.. ఎవరికి వారుగా మాట్లాడుకోవటం విశేషం. అన్నింటికి మించి.. కేటీఆర్.. ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.సీఎం స్టాలిన్ నివాసానికి కేసీఆర్ మొత్తం కుటుంబంతో వెళితే.. స్టాలిన్ కుటుంబంలో కొందరు మాత్రమే ఉన్నారు. ఏమైనా.. ఈ భేటీ రోటీన్ కు భిన్నమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News