అనంతపురంలో తోపెవరో తేలిపోనుంది..

Update: 2017-02-16 06:05 GMT
అనంతపురం టీడీపీలో ఎవరి కుంపటి వారిదే. అందరూ హీరోలే. మొన్నటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి బ్రహ్మాండంగా సెటిలైపోయారు జేసీ బ్రదర్స్. ఇద్దరు అన్నదమ్ములూ ఒకరు ఎమ్మెల్యే - ఇంకొకరు ఎంపీ టిక్కెట్లు సంపాదించుకుని గెలిచేశారు.  మరోవైపు పరిటాల సునీత వర్గం మొదటి నుంచి అక్కడ ప్రధాన వర్గంగా ఉంది. కొత్తగా చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ కూడా తన మాటే నెగ్గాలంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సీటెవరికి ఇస్తారన్నది ప్రశ్నార్థకం. మూడు వర్గాలు ముగ్గురి పేర్లు ప్రతిపాదిస్తుండడంతో అందులో ఎవరు తమ సత్తా చూపించి తమ వారిని ఎమ్మెల్సీ చేయగలరో చూడాలి.
    
జేసీ బ్రదర్స్ ఎన్నికల్లో గెలిచిన తరువాత పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  కానీ.. ఎంపీగా జేసీ ఏ పనిచేసేందుకు ప్రయత్నించినా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ వస్తున్నారు. చివరకు అనంతపురం పాతూరులో రోడ్డును వెడల్పు చేసి తీరుతారని శపథం చేసిన దివాకర్ రెడ్డి ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల నుంచి ప్రతిఘటన రావడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేయాల్సి వచ్చింది. అయితే జేసీ దివాకర్ రెడ్డి  ఇటీవల తన పద్ధతి మార్చారు. పట్టు పెంచుకోవాలంటే ఫైటింగు కంటే పెద్దమనిషిని పట్టుకోవడం ప్రధానమని గుర్తించారు.. చంద్రబాబు వద్ద పట్టు పరిశ్రమ ప్రయోగం చేస్తున్నారు.  ఇందుకోసం చంద్రబాబు మెచ్చేలా జగన్ ను తిట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో చంద్రబాబు కూడా రాయలసీమలోని ఏ జిల్లాకు వెళ్లినా జేసీ దివాకర్‌ రెడ్డికి ఆహ్వానం పలికి బహిరంగ సభలో జగన్‌ ను దుమ్మెత్తిపోసే పనిని అప్పగిస్తున్నారు. దీంతో చంద్రబాబు వద్ద తన పలుకుబడి బాగా పెరిగిందని జేసీ అనుకుంటున్నారట.  త్వరలో అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండడంతో ఆ సీటు తమ అల్లుడికి కావాలని జేసీ బ్రదర్సు కోరుతున్నారు.
    
అయితే.. ఇప్పటి వరకు మెట్టు గోవిందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చాలా మంది రేసులోకి వచ్చేశారు. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవడంతో అప్పట్లో హిందూపురం స్థానాన్ని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. బాలకృష్ణ రికమెండేషన్ ఆయనకే ఉంది.  తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన షయాజ్ బాషా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మరోసారి చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పరిటాల వర్గం కూడా తమ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పరిటాల రవికి ప్రధాన అనుచరుడైన గడ్డం సుబ్బుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పరిటాల వర్గం డిమాండ్. 2005లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా నామినేషన్ కార్యక్రమంలో జరిగిన అల్లర్లలో ఏఎస్‌ కుళ్లాయప్ప హత్య కేసులో గడ్డం సుబ్బు నిందితుడు.  పార్టీ కోసం అంతగా కష్టపడిన గడ్డం సుబ్బును ఎమ్మెల్సీ చేయాల్సిందేనంటోంది పరిటాల వర్గం.
    
పాత టీడీపీ నేతలే ఎమ్మెల్సీ సీటు కోసం కొట్టుకుంటుంటే జేసీ బ్రదర్స్‌ కూడా రంగ ప్రవేశం చేశారు. వీరు ఏకంగా అల్లుడిని ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి రాయదుర్గం టీడీపీ బాధ్యతలు చూసేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కాల్వ శ్రీనివాస్‌ కోసం దీపక్ రెడ్డిని చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా తమ అల్లుడికి అవకాశం ఇవ్వాలని జేసీ బ్రదర్స్ గట్టిగా కోరుతున్నారు.  జేసీ బ్రదర్సు గతంలో కాంగ్రెస్ లో ఉన్నా దీపక్ టీడీపీలో ఉండేవారు. దీంతో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… పార్టీ కోసం దీపక్‌ రెడ్డి భారీగా డబ్బు ఖర్చు చేసిన విషయాన్ని కూడా జేసీ వర్గం గుర్తుచేస్తూ సీటు అడుగుతోంది.  
    
మరి జేసీల మాట గెలుస్తుందో.. పరిటాల పంతం చెల్లుతుందో... బాలయ్య బామ్మర్దితనానికే విలువ దక్కుతుందో చూడాలి. ఏదైనా ఈ ఎమ్మెల్సీ సీటుతో అనంతపురంలో తోపెవరో తేలిపోబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News