టీఆర్ ఎస్‌ లో ఆ రెండు వ‌ర్గాల పోటాపోటీ

Update: 2015-07-28 15:27 GMT
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్‌ లో గ్రూప్ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ అయిన నేప‌థ్యంలో వ‌ల‌సలు స‌హ‌జ‌మే. దీనికి తోడుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు గ్రామ స‌ర్పంచ్‌ ల నుంచి మొద‌లుకొని ఎమ్మెల్యేల వ‌ర‌కు గులాబీ గూటికి ఆహ్వానించారు. ఇదంతా బంగారు తెలంగాణ కోస‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో పార్టీలో పెద్ద ఎత్తున కొత్త నీరు వ‌చ్చి చేరింది. అయితే ఉద్య‌మ‌కాలం నుంచి ఉన్న వారికి, కొత్తగా వ‌చ్చిన బంగారు తెలంగాణ(బీటీ) బ్యాచ్‌ కు మ‌ధ్య ర‌గ‌డ న‌డుస్తోంద‌ని సమాచారం. ఈ క్ర‌మంలో ప‌లు సంఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి.

టీఆర్ ఎస్ లో ఉండి ఉద్యమాల్లో పాల్గొన్నవారిని యుటి బ్యాచ్ అని, అధికారం వచ్చిన తర్వాత టీఆర్ ఎస్ లో చేరిన వారిని బీటీ బ్యాచ్ అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే ప‌లు నియోజకవర్గాల్లో ఈ రెండు వర్గాల మధ్య పొసగడం లేదని సమాచారం. ఇందుకు న‌గ‌రంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం అయిన కూక‌ట్‌ప‌ల్లి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటున్నారు. ఇటీవలే టీఆర్ ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు, ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిముక్కల పద్మారావుకు మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌టం లేద‌ట‌. ఈ నాయ‌కులు రెండు వర్గాలు చీలిపోయిన నేప‌థ్యంలో ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు మిగిలిపోయారని సమాచారం.

టీఆర్ ఎస్ పార్టీ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పద్మారావు వేసిన కమిటీలతో సంబంధం లేకుండా కృష్ణారావు కమిటీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తలు ఏ కమిటీల్లో ఉండాలి...ఎవరితో ఉంటే పని అవుతుందన్న సందిగ్దంలో ఉన్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి తలసాని నియోజకవర్గంలోనూ, సికింద్రాబాద్ లోనూ, మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి నియోజకవర్గంలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా టీఆర్ ఎస్ లో బీటీ, యూటీ కమిటీలు ఏర్పాటవుతున్న తీరు పార్టీ బ‌లోపేతానికి కాకుండా....పార్టీని రోడ్డున ప‌డేసేందుకు కార‌ణం అవుతాయా అని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News