భారతీయుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Update: 2021-08-18 11:30 GMT
ఆఫ్ఘనిస్ధాన్లో ఇరుక్కుపోయిన భారతీయుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తాలిబన్ల అరాచకాలను దగ్గరుండి మరీ చూసిన వాళ్ళు కావటంతో మనవాళ్ళ బాధ చెప్పనలవి కాకుండా ఉంది. కేంద్రప్రభుత్వం తాజా అంచనా ప్రకారం ఆప్ఘన్లో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య సుమారుగా 2 వేలుంటుంది. వీరంతా గడచిన 20 ఏళ్ళలో మనదేశం నుండి అక్కడికి వెళ్ళినవారే. బ్యాంకులు, ఐటీ సంస్ధలు, నిర్మాణ సంస్ధలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్ధలు, టెలికాం సంస్ధలు, సెక్యూరిటి, యూనివర్సిటీలు, మనదేశం అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నవారే.

నిజానికి వీరంతా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకుంటునే సంవత్సరాలుగా ఆఫ్ఘన్లో ఉంటున్నారు. కానీ హఠాత్తుగా మొత్తం దేశాన్ని తాలిబన్లు తమ వశం చేసుకోవటంతో పాటు ఒక్కసారిగా అరాచకాలు మొదలుపెట్టడంతో అందరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడెప్పుడు దేశాన్ని వదిలేసి భారత్ కు వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కానీ అవకాశాలు లేకపోవటంతో ఏ నిముషంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

అమెరికా పౌరుల్లాగ ముందుజాగ్రత్త పడకుండా మనజనాలు ఆఫ్ఘన్ను వదిలేయటంలో కాస్త జాప్యం చేశారు. దీంతో వేలాదిమంది ఇపుడు బయటపడే దారిలేక అక్కడే తగులుకునేశారు. దేశంమొత్తాన్ని తమ వశం చేసుకోగానే తాలిబన్లు ముందుగా చేసిందేమంటే దేశపు సరిహద్దులను మూసేశారు. అలాగే తమ దేశ గగనతలంపై ఏ విమానం కనిపించినా కాల్చేస్తామని ప్రకటించారు. దాంతో విదేశాలన్నీ ఆఫ్ఘనిస్ధాన్ కు విమానాలను అర్జుంటుగా రద్దు చేసుకున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా తాలిబన్లు విమానాలను రద్దుచేశారు.

దాంతో విదేశాలకు-ఆఫ్ఘనిస్ధాన్ కు ఉన్న ఏకైక ప్రయాణమార్గం మూసుకుపోయింది. దీనికారణంగా చాలాదేశాల జనాలు ఇపుడు ఆఫ్ఘన్లో ఇరుక్కుపోయారు. మొన్నటి జూలైలోనే కౌన్సులేట్ జనరల్ ఆఫీసును మూసేయటంతో ఆ సిబ్బంది భారత్ కు వచ్చేశారు. అయితే రాయబార కార్యాలయాన్ని మాత్రం పనిచేయిస్తున్నారు. ఇపుడు రాయబార కార్యాలయంలోనే ఉద్యోగులు, ప్రముఖులు సుమారు 300 మంది చిక్కుకుపోయారు. వీరిని భారత్ కు రప్పించేందుకు ఎంత ప్రయత్నించినా కుదరటంలేదు. అతికష్టం మీద సుమారు 150 మందిని మనదేశానికి రప్పించగలిగారు.

తాలిబన్ల చేతిలో ఆయుధమన్నది పిచ్చోడి చేతిలో రాయిలాంటిది. తాజాగా దేశప్రజలందరికీ తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటించినప్పటికీ ఎప్పుడే విధంగా వ్యవహరిస్తారో ఎవరు ఊహించలేరు. 20 ఏళ్ళుగా తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలకు సహకరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని తాలిబన్లు ప్రకటించినా ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ఎవరెవరు తమకు వ్యతిరేకంగా అమెరికా, ఆప్ఘన్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారనే విషయాన్ని చాపకింద నీరులాగ జాబితా తయారు చేస్తున్నారట. దాంతోనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.


Tags:    

Similar News