రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు !

Update: 2021-11-01 14:30 GMT
కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌ టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి.వరుసగా నాలుగో నెల రూ.లక్ష కోట్ల వసూళ్లను అధిగమించాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌ టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ.


అక్టోబరు నెలకు గానూ రూ.1,30,127 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.23,861 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.30,421 కోట్లు. సమ్మిళిత జీఎస్‌టీ కింద రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,998 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.8,484 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.699 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

గతేడాది అక్టోబరుతో పోలిస్తే గత నెల జీఎస్‌ టీ వసూళ్లు 24శాతం పెరిగాయి. అంతేగాక, జీఎస్‌ టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జీఎస్‌ టీ ఆదాయం రావడం ఇదే రెండోసారి మాత్రమే అని ఆర్థికశాఖ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నెలలో జీఎస్‌ టీ వసూళ్లు ఆల్‌ టైం రికార్డును తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ సమ్మిళిత జీఎస్‌ టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News