సామాన్యుడి మీద‌ ప‌డ్డ‌ జీఎస్టీ భారంపై మాట్లాడ‌రేం

Update: 2017-08-05 06:03 GMT
చూస్తుంటే దేశ ప్ర‌జ‌లంతా మోడీ మ‌త్తులో మునిగితేలుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మాట అన్నందుకు చాలామందికి కోప‌తాపాలు రావొచ్చు. కానీ.. వాస్త‌వ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు ఏవైనా ప‌న్నుబాదుడుకి తెర తీస్తే.. దాని మీద ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌ల బాట ప‌ట్ట‌టం చూశాం.

అంతేకానీ.. స్పెష‌ల్ పార్టీలు చేసుకుంటూ.. బిర్యానీలు తింటూ.. ప‌న్ను బాదుడు ముహుర్తాన్ని ద‌గ్గ‌రుండి మ‌రీ వెల్ కం చెప్పిన వైనం ఏమైనా ఉందంటే అది జీఎస్టీలోనే జ‌రిగింద‌ని చెప్పాలి. ఈ మ‌ధ్య‌న జ‌న‌జీవితాల్లోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియాలో అయితే.. జీఎస్టీ హ‌డావుడి పీక్స్‌కు చేరిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కేకులు కోయ‌టం.. హ్యాపీ జీఎస్టీ అంటూ శుభాకాంక్ష‌లు చెబుతూ చేసుకున్న వేడుక‌ల తీరు ప‌లువురికి షాకింగ్ గా మారాయి.

త‌న మిగిలిన మాట‌ల మాదిరే.. జీఎస్టీతో ప్ర‌జ‌లకు అంతా మంచే కానీ ఎలాంటి చెడు జ‌ర‌గ‌ద‌న్న‌ట్లుగా చేసిన ప్ర‌చారానికి దేశ ప్ర‌జ‌లు న‌మ్మిన‌ట్లుగా చెప్పాలి. ఇప్ప‌టికే ఉన్న ప‌న్నుల‌తో పోలిస్తే.. జీఎస్టీ భారం త‌క్కువ‌న్నట్లుగా మోడీ స‌ర్కారు చేసిన ప్ర‌చారానికి దేశ ప్ర‌జ‌లు ఫిదా అయిన‌ట్లుగా చెప్పాలి. అందుకే జీఎస్టీకి వెల్ కం చెప్పిన ప్ర‌జ‌ల‌కు.. ఇప్పుడిప్పుడే దాని మోత ఎంత ఎక్కువ‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలిసి వ‌స్తోంది. అలా అని త‌మ‌కున్న అసంతృప్తిని ప్ర‌జ‌లు బ‌య‌టపెట్ట‌లేని ప‌రిస్థితి.

పార్టీలు చేసుకొని.. కేకులు క‌ట్ చేసుకొని.. గ్రీటింగ్స్ చెప్పుకొని మ‌రీ స్వాగ‌తం చెప్పిన జీఎస్టీ మోత‌కు త‌మ జేబుకు ప‌డుతున్న చిల్లును స‌గ‌టు జీవి మౌనంగానే భ‌రిస్తున్నాడే త‌ప్పించి నోరెత్తి మాట్లాడ‌లేక‌పోతున్నాడు. ఇదిలా ఉంటే.. జీఎస్టీ దెబ్బ‌కు సామాన్యుడే కాదు.. స‌ర్కారు కూడా హ‌డ‌లిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కార‌ణంగా రాష్ట్ర బ‌డ్జెట్ ఫిగ‌ర్స్ కూడా మారిపోతున్నాయ‌న్న ఆందోళ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలోకి చేరారు టీఆర్ఎస్ లోక్ స‌భా ప‌క్ష నేత జితేంద‌ర్ రెడ్డి.   ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను జీఎస్టీ నుంచి మిన‌హాయింపులు ఇవ్వాల‌న్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన వాయిదా తీర్మానానికి నో చెప్పిన లోక్ స‌భ స్పీక‌ర్‌.. ఈ అంశాన్ని జీరో అవ‌ర్ లో మాట్లాడేందుకు అనుమ‌తి ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో జీఎస్టీ ఎఫెక్ట్ గురించి జితేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌ రాష్ట్రంలో సుమారు రూ.2.30 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు న‌డుస్తున్నాయ‌ని చెప్పారు. మిష‌న్ కాక‌తీయ‌.. భ‌గీర‌థ‌.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇలా అభివృద్ధి ప్రాజెక్టులు భారీగా న‌డుస్తున్నాయ‌ని.. ఆయా ప‌నుల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ 5 శాతం వ్యాట్ తో టెండ‌ర్లు పిల‌వ‌గా.. జీఎస్టీ పుణ్య‌మా అని ఇప్పుడు ప‌న్నుశాతం 18 శాతానికి చేరింద‌న్నారు.

గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా న‌డుస్తున్న ప్రాజెక్టుల‌కు తాజా జీఎస్టీ ఎఫెక్ట్ తో  రాష్ట్రంపై అద‌నంగా రూ.19,200 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లుగా చెప్పారు. ఈ కార‌ణంతో జీఎస్టీని రాష్ట్ర ప‌థ‌కాల‌కు మిన‌హాయింపులు ఇవ్వాల‌న్నారు. ఇదిలా ఉంటే.. ఈ అంశాన్ని జీఎస్టీ మండ‌లి స‌మావేశం దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు. అంత పెద్ద రాష్ట్ర స‌ర్కారే జీఎస్టీ దెబ్బ‌కు కిందామీదా ప‌డుతుంటే.. సామాన్యుడి మాటేమిటి? ప‌్ర‌భుత్వాలు త‌మ ఈతి బాధ‌ల్ని లోక్ స‌భ‌లో చెప్పుకుంటున్నారు స‌రే.. మ‌రి.. కామ‌న్ మ్యాన్ మీద ప‌డిన జీఎస్టీ భారం గురించి ఏ నేత ఎందుకు ప్ర‌స్తావించ‌ట్లు చెప్మా?


Tags:    

Similar News