సింఫుల్ గా జీఎస్టీ లెక్క మొత్తాన్ని చూస్తే..

Update: 2017-06-18 16:34 GMT
ఒక‌దేశం ఒక ప‌న్ను. జీఎస్టీకి ట్యాగ్ లైన్‌. సినిమాల‌కు.. క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్స్‌ కు ట్యాగ్ లైన్ చూశాం కానీ.. ప్ర‌జ‌ల్ని బాదేసే ప‌న్ను చ‌ట్టానికి ట్యాగ్ లైన్ జీఎస్టీ ప్ర‌త్యేక‌త‌. కొన్నేళ్లుగా ఈ ప‌న్ను విధానాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు యూపీఏ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ద‌శ‌ల వారీగా ఒక్కొక్క అడుగు ప‌డి.. చివ‌ర‌కు అమ‌లు వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి.. ఈ స‌మ‌య‌మైంది. మ‌హా అయితే.. మ‌రో ప‌ది రోజులు.. ఇంకాస్త క‌చ్ఛితంగా చెప్పాలంటే 12 రోజులు మాత్ర‌మే కొత్త ప‌న్ను చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌టానికి టైముంది. తాజా జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే.. ఇంత‌కాలం ఉన్న ప‌న్ను విధానం మొత్తం ర‌ద్దు కానుంది.

ప‌న్నులకు సంబంధించి అతి పెద్ద సంస్క‌ర‌ణ‌గా జీఎస్టీని అభివ‌ర్ణిస్తుంటారు. ఇంత‌కీ.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి? ఈ ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే ఏమ‌వుతుంది? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అస‌లు జీఎస్టీని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది? ఈ విధానం మీద దేశ వ్యాప్తంగా భారీ చ‌ర్చ ఎందుకు న‌డుస్తోంది? వ్యాపార వ‌ర్గాల నుంచి పారిశ్రామిక వ‌ర్గాల వ‌ర‌కూ ఎందుకంత ఉత్కంట‌తో ఎదురుచూస్తున్నాయి? ఈ ప‌న్ను అమ‌లుతో దేశ ఆర్థిక స్వ‌రూపం మారిపోతుంద‌న్న అంచ‌నాలు ఎందుకు వ్య‌క్త‌మ‌వుతున్నాయి? ఈ జీఎస్టీతో ఏం జ‌ర‌గ‌నుంది? సామాన్యుడికి ఒరిగేదేంటి? ఈ ప‌న్నుతో ధ‌ర‌లు త‌గ్గుతాయన్న‌ది ఎంత వ‌ర‌కు నిజం? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చూస్తే..

నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ జేబులో నుంచి తీసే ప్ర‌తి రూపాయికి.. కార్డుతో చెల్లించే ప్ర‌తి చెల్లింపులోనూ క‌నిపించే ప‌న్నులు.. క‌నిపించ‌ని ప‌న్నులు రెండూ ఉంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో ర‌క‌ర‌కాల ప‌న్నులు విధిస్తుంటారు. కానీ.. జులై 1 నుంచి గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ సింఫుల్‌ గా చెప్పాలంటే జీఎస్టీ అమ‌ల్లోకి రానుంది. ఈ ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే.. ప్ర‌త్య‌క్ష ప‌న్నులైన ఇన్‌కం ట్యాక్స్ (ఆదాయ‌ప‌న్ను).. కార్పొరేట్ ప‌న్ను మిన‌హా.. కేంద్రం.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌సూలు చేసే ప‌రోక్ష ప‌న్నుల‌న్నీ మాయ‌మైపోయ‌తాయి. వాటి స్థానంలో కొత్త జీఎస్టీ ఒక్క‌టే ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు 17 ర‌కాల ప‌న్నుల్ని విధిస్తున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో ఒకే ఒక్క ప‌న్ను విధిస్తారు. అదే జీఎస్టీ. ఈ ప‌న్ను విధానం కోసం 122వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసి కొత్త ప‌న్ను విధానాన్ని అమ‌ల్లోకి తెస్తున్నారు.

జీఎస్టీని ప్ర‌పంచంలో తొలిసారిగా అమ‌లు చేసిన దేశం ఫ్రాన్స్ గా చెప్పొచ్చు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో 140 దేశాల్లో జీఎస్టీని అమ‌లు చేస్తున్నారు. బ్రెజిల్.. కెన‌డా దేశాల్లో ద్వంద జీఎస్టీ ఉంది. భార‌త్‌లోనూ అదే విధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు. జీఎస్టీతో వ‌చ్చే మార్పు ఏమిటంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ విధిస్తున్న ప‌న్నుల‌న్నీ పోయి జీఎస్టీ ఒక్క‌టే ఉంటుంది.

అది కూడా 0 నుంచి 28 శాతం మాత్ర‌మే ప‌న్ను ఉంటుంది.మ‌నం నిత్యం ఉప‌యోగించే వ‌స్తువుల నుంచి వ‌స్తుసేవ‌ల వ‌ర‌కూ ఈ ప‌న్ను ఉంటుంది. ఐదు శ్లాబుల్లో ఉండే ఈ ప‌న్నుకు సెస్సులు క‌లిపితే గ‌రిష్ఠంగా 43 శాతం ప‌న్ను విధించే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. ఏ వ‌స్తువ కైనా.. అయితే ప‌న్ను ఏమీ లేకుండా ఉండ‌టం.. లేదంటే వివిధ శ్లాబుల్లో ప‌న్నులు విధిస్తారు. గ‌రిష్ఠంగా ప‌న్ను అంటే 43 శాతం ప‌న్ను ఉండ‌నుంది. అంత‌కు మించిన ప‌న్ను జీఎస్టీలో లేదు.

ఒకే ప‌న్నుగా చెప్పే జీఎస్టీలోనూ మూడు ర‌కాలు ఉంటాయి. అవి 1. సెంట్ర‌ల్ జీఎస్టీ.. 2. స్టేట్ జీఎస్టీ.. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ.  ఈ ఒక్కో జీఎస్టీలో ఇప్ప‌టికే ఉన్న ప‌న్నులు విలీనం కానున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు సెంట్ర‌ల్ జీఎస్టీ సంగ‌తే చూస్తే.. ఇది కేంద్రం ప‌రిధిలో ఉంటుంది. ఇంత‌కాలం కేంద్రం ప‌రిధిలోని సెంట్ర‌ల్ ఎక్సైజ్‌.. అడిష‌న‌ల్ ఎక్సైజ్ డ్యూటీ.. క‌స్ట‌మ్స్‌.. స‌ర్వీస్ ట్యాక్స్‌.. స‌ర్ ఛార్జీ.. కౌంట‌ర్ వీలింగ్ డ్యూటీలు సీజీఎస్టీలో విలీనం కానున్నాయి.

జీఎస్టీలో ఉన్న ప‌న్ను శ్లాబుల్ని చూస్తే.. 0.. 3..5..12..18..28 శాతంగా ఉండ‌నున్నాయి. ఈ ప‌న్ను విధానం కార‌ణంగా ధ‌ర‌లు త‌గ్గుతాయ‌న్న‌ది కొంద‌రి వాద‌న‌మైతే.. మ‌రికొంద‌రి వాద‌న మాత్రం ధ‌ర‌లు పెరుగుతాయ‌నే. అయితే.. ఎక్కువ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని నిపుణుల చెబుతున్నారు.

పెరిగేవి.. త‌గ్గేవి చూస్తే..

+ మామూలు రెస్టారెంట్ల‌లో ఆహారం తింటే ఫ‌ర్లేదు. కాస్త ధ‌ర‌ త‌గ్గే వీలుంది. రూ.50 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న రెస్టారెంట్ల‌లో బిల్లుపై 5 వాతం.. నాన్ ఏసీ రెస్టారెంట్ల‌లో 12 శాతం.. ఏసీ.. మ‌ద్యం అనుమ‌తి ఉన్న రెస్టారెంట్ల‌లో 18 శాతం ప‌న్ను వేస్తారు.

+  వెయ్యి రూపాయిల‌లోపు అద్దె ఉండే హోట‌ళ్ల‌ను.. లాడ్జిల‌ను ప‌న్ను ప‌రిధి నుంచి త‌ప్పించారు. వెయ్యి నుంచి రూ.2వేల మ‌ధ్య‌లో ఉండే హోట‌ళ్ల‌పై 12శాతం.. రూ.2500 నుంచి రూ.5వేల మ‌ధ్య‌లో ఉండే వాటికి 18 శాతం.. ఆ పైన వాటికి 28 శాతం ప‌న్ను విధించ‌నున్నారు.

+ ఫోన్లు.. ల్యాప్ టాప్‌లు.. కంప్యూట‌ర్లు త‌దిత‌రాల‌ను దిగుమ‌తి చేసుకున్నా.. విడిప‌రిక‌రాలు దిగుమ‌తి చేసుకొని దేశంలో అసెంబ్లింగ్ చేసినా 18 శాతం ప‌న్ను వ‌సూలు చేస్తారు. దీంతో.. జీఎస్టీకి ముందుతో పోలిస్తే.. కొత్త ప‌న్ను విధానం అమ‌లయ్యాక మ‌రింత పెరిగనుంది. అదే స‌మ‌యంలో టెలికం రంగానికి 15 శాతం ఉన్న స‌ర్వీస్ ట్యాక్స్‌ను 18 శాతం ప‌రిధిలో చేర్చ‌టంతో.. జీఎస్టీ అమ‌లు అనంత‌రం కాల్ రేట్లు సైతం పెరుగుతాయి.

+ ఫ్యాష‌న్ దుస్తులపై ఎక్సైజ్‌.. వ్యాట్ క‌లిపి ప్ర‌స్తుతం 7.5 శాతం ప‌న్ను ఉండ‌గా.. జీఎస్టీలో దీన్ని 5 శాతం శ్లాబ్‌లోకి చేర్చారు. దీంతో.. వెయ్యి రూపాయిల టీ ష‌ర్ట్ మీద ఇప్పుడు 75 ఉండే ప‌న్ను కాస్తా.. రూ.50ల‌కు త‌గ్గ‌నుంది. అయితే.. ఇదంతా వెయ్యి కంటే త‌క్కువ ధ‌ర ఉన్న వాటికే. ఒక‌వేళ రూ.వెయ్యి కంటే ఖ‌రీదైన చీర‌లు.. వ‌స్త్రాల‌పై 12 శాతం ప‌న్నును విధిస్తారు.

+ ప్ర‌స్తుతం ఫ్రిజ్‌లు.. వాషింగ్ మెషీన్లు లాంటి గృహోప‌క‌ర‌ణాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ గ‌రిష్ఠంగా 27 శాతం ప‌న్నులు ఉండ‌గా.. జీఎస్టీలో 28 శాతం ప‌న్ను విభాగంలోకి చేర్చారు. అంటే.. వీట‌న్నింటికి ఒక శాతం ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.అదే స‌మ‌యంలో టీవీల‌ను 18 శాతం ప‌రిధిలోకి తీసుకురావ‌టంతో టీవీల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

+ నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు.. అంటే స‌బ్బులు.. పౌడ‌ర్లు.. పేస్టులు.. ఇలాంటి వాటిపై ఇప్ప‌టివ‌ర‌కు గ‌రిష్ఠంగా 25 శాతం మేర ప‌న్నులు విధిస్తున్నారు. వీటిలో చాలావ‌ర‌కూ 18 శాతం శ్లాబులో వేశారు. దీంతో ఈ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. బియ్యం..పాలు.. గుడ్లు.. పెరుగు.. తృణ‌ధాన్యాలు.. ప‌ప్పు దినుసుల‌పై ప్ర‌స్తుతం 5 శాతం వ‌ర‌కు ప‌న్నులు ఉండ‌గా.. వీటిని జీఎస్టీ నుంచి తొల‌గించారు. దీంతో.. ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. అయితే.. బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేస్తే మాత్రం 5 శాతం ప‌న్ను ప‌డ‌నుంది.  కీల‌క‌మైన పంచ‌దార‌.. టీ..కాఫీ.. వంట‌నూనెల‌పై ప్ర‌స్తుతం 5 శాతం ప‌న్నులు ఉన్నాయి. జీఎస్టీలోనూ అదే మొత్తంతో ఉండ‌టంతో ధ‌ర‌ల్లో తేడా ఉండే అవ‌కాశం చాలా త‌క్కువ‌.

+ కూల్ డ్రింక్స్‌.. బూస్ట్‌.. హార్లిక్స్ లాంటి పానీయాలు.. చాక్ లెట్లు.. చూయింగ్ గ‌మ్స్  లాంటి వాటిపై ప్రస్తుతం గ‌రిష్ఠంగా 25 శాతం ప‌న్నులు ఉన్నాయి. జీఎస్టీలో అది కాస్తా 28 శాతం చేయ‌నుండ‌టంతో వీటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

+ రూ.500లోపు ఉండే చెప్పుల ధ‌ర‌లు త‌గ్గితే.. రూ.500 దాటిన చెప్పుల ధ‌ర‌లు పెరుగుతాయి. సిగిరెట్ల‌కు 28 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు. తునికాకుపై మాత్రం 18 శాతం ప‌న్ను. దీంతో.. వీటి ధ‌ర‌లు పెరుగుతాయి. బ‌స్సు.. మెట్రో.. స‌బ‌ర్బ‌న్ లాంటి ప్ర‌జార‌వాణా టిక్కెట్ల‌పై స‌ర్వీస్ ట్యాక్స్ లేక‌పోవ‌టంతో ధ‌ర‌లు త‌గ్గుతాయి. దూర‌ప్ర‌యాణాల ఏసీ కోచ్ టిక్కెట్ల‌కు స‌ర్వీస్ ట్యాక్స్ ఉంది. కాబ‌ట్టి ధ‌ర‌ల్లో మార్పు ఉండ‌దు. ఓలా.. ఉబ‌ర్ లాంటివాటిపై ఇప్పుడున్న 6 శాతం స‌ర్వీస్ ట్యాక్స్‌ను 5 శాతానికి త‌గ్గించ‌టంతో ఒక శాతం ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. విమానాల్లో ప్ర‌స్తుతం ఎకాన‌మీ క్లాస్‌కు గ‌రిష్ఠంగా 6 శాతం ప‌న్నులు ఉన్నాయి. జీఎస్టీలో  5 శాతానికి త‌గ్గించ‌టంతో వాటి ధ‌ర‌లు త‌గ్గుతుండ‌గా.. బిజినెస్ క్లాస్ టిక్కెట్ల‌పై ఉన్న 9 శాతం ప‌న్నును 12 శాతానికి పెంచారు. దీంతో బిజినెస్ క్లాస్ టిక్కెట్ల ధ‌ర‌లు పెరుగుతాయి.

+ వాహ‌న‌రంగానికి అన్ని ప‌నులు క‌లిపి 32 శాతం నుంచి 55 శాతం వ‌ర‌కూ ప‌న్నులు ఉన్నాయి. జీఎస్టీలో బైకులు.. ఎలక్ట్రిక్ కార్లు.. ట్రాకర్లు మిన‌హా మిగిలిన అన్ని ర‌కాల వాహ‌నాల‌కు 28 శాతం ప‌న్ను విధించారు. చిన్న‌కార్ల ధ‌ర‌లు కాస్త పెర‌గ‌నున్నాయి. ఎస్‌యూవీ.. సెడాన్ కార్ల ధ‌ర‌ల్లో మార్పు లేదు. ల‌గ్జ‌రీ కార్లు (బెంజ్‌.. ఆడి.. బీఎండ‌బ్ల్యూ) ప‌న్నును ప్ర‌స్తుతం ఉన్న ప‌న్నుతో పోల్చిన‌ప్పుడు  12 శాతం మేర త‌గ్గించారు. దీంతో.. వీటి ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. ట్రాక్ట‌ర్ మీద మార్చిన ప‌న్ను కార‌ణంగా ఒక్కో ట్రాక్ట‌ర్ మీద రూ.28వేల వ‌ర‌కు ధ‌ర పెర‌గ‌నుంది.

+ బంగారం ధ‌ర‌లు ఒక శాతం ధ‌ర‌లు పెరుగుతాయి. క‌స్ట‌మ్స్ డ్యూటీలో మార్పు లేనందున విదేశాల‌కు.. మ‌న‌కు మ‌ధ్య ప్ర‌తి గ్రాముకు రూ.300 వ‌ర‌కు వ్య‌త్యాసం ఉండ‌నుంది. ఆభ‌ర‌ణాల త‌యారీకి ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిం చేసుకునే వీలు ఉంది. దీంతో స్వేచ్చ‌గా ర‌వాణా చేసే వీలుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News