జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్‌

Update: 2017-10-23 16:18 GMT
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఆ ఎన్నిక‌ల తేదీల‌ను ఈసీ వెల్లడించక పోయినా బీజేపీ, కాంగ్రెస్ లు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ప్ర‌ధాని మోదీ, ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల‌ను మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ఎన్నిక‌ల‌ను రాబోయే ఎన్నిక‌లుక రిహార్స‌ల్ గా మోదీ భావిస్తున్నారు. మ‌రోవైపు త్వ‌ర‌లో కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్న రాహుల్ గాంధీ...గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంటే, విజ‌యం కోసం కాంగ్రెస్ అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది.  దీంతో కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య ప‌రస్పర ఆరోపణల పర్వం తార‌స్థాయికి చేరింది.

గుజ‌రాత్ లో ఆదివారం ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మ‌రుస‌టి రోజే రాహుల్ గాంధీ అక్క‌డ ప‌ర్య‌టించారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ పాల్గొన్నారు. గుజ‌రాత్ కు చెందిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ ....రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం దేశంలో మోదీ ఒంటెత్తు పాల‌న న‌డుస్తోంద‌ని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అది అందరి ప్రభుత్వం అవుతుందన్నారు. వెల‌క‌ట్ట‌లేని గుజ‌రాతీల‌ను కొనాల‌ని మోదీ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. 1000 కోట్లిచ్చినా వారిని కొన‌లేర‌న్నారు. గుజరాత్‌లోని అన్ని వర్గాలకు చెందిన కోట్లాది మంది యువకులు తమ గళం విప్పారని, యువత గొంతును ఏ ఒక్కరూ అణిచివేయలేరని, వారిని కొనుగోలు చేయలేరని రాహుల్ పేర్కొన్నారు. గుజరాత్‌లో 30 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారని, వారికి ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాహుల్ అన్నారు. మోదీ సెల్ఫీ తీసుకున్నంత సమయంలో చైనాలో ఒకరికి ఉద్యోగం వస్తోందని ఎద్దేవా చేశారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌ధాని తీసుకున్న అనాలోచిత నిర్ణ‌య‌మ‌ని రాహుల్ అన్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మోదీ చిన్నాభిన్నం చేశార‌ని మండిప‌డ్డారు.  నోట్ల ర‌ద్దు అనంత‌రం మూడు రోజుల వ‌ర‌కు మోదీకి ఏంజ‌రుగుతుందో అర్థం కాలేద‌న్నారు. డిసెంబ‌రు 30లోగా న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీయ‌క‌పోతే త‌న‌ను ఉరి తీయాలంటూ మొస‌లి క‌న్నీరు కార్చార‌ని ఎద్దేవా చేశారు. అంత‌టితో ఆగ‌కుండా మోదీ ప్ర‌జ‌ల‌పై జీఎస్టీ భారాన్ని మోపార‌ని మండిప‌డ్డారు. జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ అని విమ‌ర్శించారు. మోదీ, ప్ర‌వేశ‌పెట్టిన డిజిట‌ల్‌, మేకిన్ ఇండియాల‌ను కూడా రాహుల్ వ‌దిలిపెట్ట‌లేదు. మీలో ఎవ‌రైనా మొబైల్ ఫోన్లు, చెక్ ల రూపంలో విత్త‌నాలు, ఎరువులు కొన్నారా అన్న‌ప్ర‌శ్న‌కు...ప్ర‌జ‌లు లేద‌ని స‌మాధాన‌మిచ్చారు. ప‌టేళ్ల ఉద్య‌మ‌నేత హార్దిక్ ప‌టేల్ స‌న్నిహితుడు న‌రేంద్ర ప‌టేల్ ను కోటి రూపాయ‌లిచ్చి కొనాల‌ని బీజేపీ నేత‌లు ప్లాన్ చేశార‌ని, దేశంలోని సంప‌ద అంతా ఇచ్చినా గుజ‌రాతీల‌ను కొన‌లేరన్నారు. 
Tags:    

Similar News