షాకింగ్: టాలీవుడ్ నిర్మాత‌లపై ఐటీ దాడులు!

Update: 2018-01-17 15:13 GMT
ప్ర‌తి ఏడాది టాలీవుడ్ కు సంక్రాంతితో కొత్త సంవ‌త్సరం మొద‌ల‌వుతుంది. ప్ర‌తి ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగిన సినిమాలలో ఒక‌టో రెండో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు ఉండ‌డం ఆన‌వాయితీ. అయితే, ఈ సారి భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన రెండు సినిమాలు అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో - టాలీవుడ్ లోగిళ్ల‌లో ఈ సంక్రాంతి వెలుగులు నింప‌లేదని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి నేప‌థ్యంలో క‌నుమ పండుగ ముగిసిన మ‌రుస‌టి రోజే టాలీవుడ్ కు మ‌రో షాక్ త‌గిలింది. బుధ‌వారం నాడు దాదాపు 10 ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల ఆఫీసుల మీద ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.

టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు - సురేష్ బాబు - చిన‌బాబు - శ‌ర‌త్ మ‌రార్ - సీ.క‌ల్యాణ్ - డీవీవీ దాన‌య్య‌ - ఆనంద్ ప్ర‌సాద్ ల‌తో పాటు మ‌రికొంత‌మంది పేర్లు సోదాలు నిర్వ‌హించిన జాబితాలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంక‌టేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ - సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - హారికా అండ్ హాసినీ క్రియేష‌న్స్ - సీకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ - భవ్య క్రియేషన్స్‌ - డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ - నార్త్‌ స్టార్ ఎంటర్‌ టైన్ మెంట్స్ ఆఫీసుల్లో ఈ త‌నిఖీలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులు ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించిన‌వి కావ‌ని తెలుస్తోంది. కొన్ని నిర్మాణ సంస్థలు జీఎస్టీ - టీడీఎస్ ఎగ‌వేత‌కు పాల్ప‌డుతున్నాయ‌న్న స‌మాచారంతో ఈ సోదాలు నిర్వహించిన‌ట్లు తెలుస్తోంది. 3 సంవ‌త్స‌రాల నుంచి టీడీఎస్ ఎగ‌వేస్తున్న కొంత‌మంది నిర్మాతలకు ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన‌ట్లు అన‌ధికారికంగా పుకార్లు వినిపిస్తున్నాయి.  
Tags:    

Similar News