నిజాంపై బాంబేసినోడ్ని కాపాడింది ఆంధ్రోళ్లే!

Update: 2018-09-17 04:12 GMT
చ‌రిత్ర‌ను మ‌స్తు అధ్య‌య‌నం చేసిన‌ట్లు చెబుతూ.. తెలంగాణ ప్ర‌జ‌లకు త‌న‌దైన స్టైల్లో ప‌లు విష‌యాన్ని చెప్పే టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి అధినేత నోటి నుంచి ఎప్ప‌టికి రాని విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇలాంటి విష‌యాల్ని మ‌రెవ‌రు చెప్పినా.. న‌మ్మాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. కానీ.. ఆ మాట‌ల్ని చెప్పిన పెద్దావిడ‌కు రాజ‌కీయ క‌ల్మ‌షం అస్స‌ల్లేదు. ఎలాంటి రాజ‌కీయాలు ఆమెకు అక్క‌ర్లేదు. కేవ‌లం నిజాల్ని మాత్ర‌మే చెప్పే ఆమె మాట‌లు తాజాగా సంచ‌ల‌నంగా మారాయి. సెప్టెంబ‌రు 17 వ‌స్తుందంటే చాలు.. తెలంగాణ విమోచ‌న దినంగా కొంద‌రు చెబితే.. మ‌రికొంద‌రు విలీన దినంగా అభివ‌ర్ణిస్తుంటారు.

నిజాం లాంటి రాజు పాల‌న నుంచి స్వాతంత్య్రాన్ని హైద‌రాబాద్ స్టేట్ ప్ర‌జ‌లు అనుభ‌వించిన రోజు అన్న‌ది మాత్రం మ‌ర్చిపోలేం. ఇలాంటి దినాన్ని తాను సాధించ‌బోయే తెలంగాణ‌లో పెద్ద పండ‌గే చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మాత్రం ఆ మాట‌ను వ‌దిలేయ‌టం తెలిసిందే.

తాను చెప్పిన మాట‌ల మీద నిల‌బ‌డే విష‌యంలో కేసీఆర్ స్టైల్ వేర‌న్న‌ది తెలిసిందే. సెప్టెంబ‌రు 17 సంద‌ర్భంగా చ‌రిత్ర‌లో జ‌రిగిన ఒక వాస్త‌వాన్ని ఒక పెద్దావిడ నోట్లో నుంచి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆవిడ ఎవ‌రంటారా?  నిజాం మీద బాంబు వేసే తెగువ‌.. ధైర్యం. సాహ‌సం చేసిన గూడూరు నారాయ‌ణస్వామి స‌తీమ‌ణి. త‌న భ‌ర్త చ‌నిపోయి చాలా కాల‌మే అయినా.. నిజాం మీద బాంబు వేసేందుకు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని ఆ వీరుడికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన నేప‌థ్యంలో నేత‌ల భావోద్వేగ వ్యాఖ్య‌ల‌కు రియాక్ట్ అయ్యే ప్ర‌జ‌లు.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న మాట‌ను ఈ ఉదంతం చెబుతుంద‌ని చెప్పాలి. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల్సిన బంధం.. అనుబంధం ఎలా ఉండాల‌న్న‌ది నారాయ‌ణ‌స్వామి భార్య మాట‌ల్ని చ‌ద‌వినంత‌నే క‌నెక్ట్ కావ‌టం ఖాయం. ఇంత‌కీ ఆమె ఏం చెప్పారంటే..

+  నిజాం మీద బాంబులేసినోళ్ల‌లో నా భ‌ర్త కూడా ఉన్న‌ట్లు పోలీసుల‌కు.. రజాకార్లకు ఎట్లా తెలిసిందో ఏమో తెలువదు కానీ.. బాంబు దాడి జరిగిన రోజు రాత్రి మా ఇంటి మీద దాడి చేసిండ్రు.. ఇల్లు పైకప్పు విప్పేసిండ్రు. తలుపులు పగులు గొట్టి ఇల్లంతా ఆగమాగం చేసిండ్రు. వాళ్ల అలికిడి విని మా ఆయన తప్పించుకున్నడు. దీంతో మేమంతా దర్గా కాజీపేటలోని ఇంటికి వచ్చినం.

+ ఒక రోజు ఆ ఇంటికి ఒకాయన వచ్చిండు. ‘నేను నారాయణస్వామి దోస్తును. మీ ఆయన ఎక్కడున్నడో చెప్పుండ్రి. ఆయనకు ఏమి కాకుండా చూసుకుంట’ అని పరిచయం చేసుకున్నడు. ముందు దోస్తే అనుకొని నమ్మినం. కానీ.. ఆయన సీఐడీ ఆఫీసరని చుట్టుపక్కోళ్లు అంటే తెలిసింది. ఆ రోజంతా మా ఇంట్లనే ఉన్నడు.

+ మా ఆయన విజయవాడ దగ్గర అజ్ఞాతంలో ఉన్నాడని కొన్నిరోజులకు మాకు కబురందింది. ఒక బ్రాహ్మణ కుటుంబం ఆయనకు ఆశ్రయమిచ్చింది. సొంత కొడుకుకంటే ఎక్కువగా చూసుకున్నారు. అటు తర్వాత మేము కూడా విజయవాడ వెళ్లినం. అక్కడివాళ్లంతా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నరు.
 
+ నిజాం రాజు మన దేశం నుంచి వెళ్లి పోయిండని తెలిసిన తర్వాత తిరిగి వరంగల్‌కు వచ్చినం. నారాయణరావ్‌ పవార్‌ జైళ్లనే ఉన్నడు.. ఆయనను విడిపించడానికి మా ఆయన చాలా ప్రయత్నాలు చేసిండు. రాజకీయాలు నచ్చక ఉద్యోగం చేసిండు. 26 ఏళ్ల కింద మా ఆయన హన్మకొండలోనే గుండెపోటుతో నన్ను విడిచి వెళ్లిపోయాడు. ఆయన నా వెంట లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు వెన్నంటే ఉన్నాయి.
Tags:    

Similar News