ఇప్పుడు పెళ్లి అంటే కత్తి మీద సామే..తేడా వస్తే కేసులేనట!

Update: 2020-05-10 04:29 GMT
కాలం ఎంత సిత్రమైంది. మొన్నటివరకూ పెళ్లి అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య సమ్మతి. కాదంటే రెండు కుటుంబాలు ఓకే అనుకుంటే అంతా హ్యాపీ. కానీ.. మాయదారి రోగం విరుచుకుపడుతున్న వేళ.. అంటువ్యాధుల చట్టం ఒకటి తెర మీదకు రావటమే కాదు.. ఫుల్ యాక్టివ్ కావటం తెలిసిందే. దీంతో.. పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రూల్స్ తప్పక పాటించటమే కాదు.. పెళ్లికి ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి అవుతుంది.

అందుకు భిన్నంగా ఎవరి అనుమతి మాకుఅక్కర్లేదు. పెళ్లి చేసుకుంటామంటే కేసులు బుక్ కావటం ఖాయమంటున్నారు. రెండు కుటుంబాలు.. ఇద్దరు వ్యక్తుల సమ్మతితో పెళ్లి జరిపే అవకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. వారు ఓకే అన్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పెళ్లి ఆనందం తర్వాత.. కేసులు మెడకు చుట్టుకొని లేనిపోని తలనొప్పులు ఖాయం.

ప్రస్తుతానికి ఎవరిళ్లల్లో వారు ఉంటూ.. అవసరాలకు బయటకు వెళ్లే అవకాశం మాత్రమే ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా అధికారులకు అప్లికేషన్ పెట్టుకోవాలి. రెవెన్యూ విభాగంలో తహసీల్దారుకు తొలుత అప్లికేషన్ పెట్టుకుంటే.. వారు అన్ని విషయాల్నిపరిశీలించి ఓకే చెబితేనే పెళ్లి చేసుకోవాలి. అందుకు ఏ మాత్రం తేడా చేసినా తిప్పలు తప్పనట్లే.

అంతేకాదు.. పెళ్లి సందర్భంగా పది మంది మహా అయితే ఇరవై మంది.. ఇలా ఎంతమందిని పిలవాలో కూడా రెవెన్యూ సిబ్బంది డిసైడ్ చేస్తారు. అదేంటి? పెళ్లికి యాభై మందిని పిలవొచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయన్న అనుమానం రావొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లికి ఎంతమంది రావాలన్నది స్థానిక పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అధికారం అధికారులకే ఉంటుందన్నది మర్చిపోకూడదు.

అంతే కాదు.. వచ్చే వారిలో అమ్మాయి తరఫు వారు ఎవరు? అబ్బాయి తరఫు వారు ఎవరు? వారి వివరాలు.. ఏం చేస్తుంటారు? లాంటివి కూడా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేనా.. భౌతిక దూరం.. మాస్కులు ధరించి పెళ్లికి హాజరవుతామని.. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామని.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటామన్న హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఊరేగింపులు.. బహిరంగ వేడుకలు.. సామూహిక విందు భోజనాలు లాంటివి ఏర్పాటు చేయమని రాతపూర్వకంగా హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా చూసినప్పుడు ఇన్ని పరిమితులతో పెళ్లి చేసుకునే కన్నా.. కాస్త వెయిట్ చేస్తే బాగుంటుందన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News