'ఆప్' ఆయుధంగా చెల‌రేగ‌నున్న బీజేపీ!

Update: 2022-12-09 03:53 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీగానే కాకుండా.. ఒక నిజాయితీప‌రుడైన వ్య‌క్తి అరవింద్ కేజ్రీవాల్  సీఎంగా ఉన్న పార్టీగా కూడా గుర్తింపు ఉంది. అయితే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఆప్ వ్య‌వ‌హ‌రించిన తీరు చూసిన త‌ర్వాత మాత్రం.. ఆప్ అనేది బీజేపీకి ఒక ఓట్ల విభ‌జ‌న‌కు వ‌జ్రాయుధంగా మారిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పార్టీని అడ్డు పెట్టుకుని.. గుజ‌రాత్‌లో బీజేపీ రాజ‌కీయాలు చేసింద‌నే వాద‌న అప్ప‌ట్లోనే జోరుగా వినిపించాయి.

ఇక‌, రిజ‌ల్ట్ వ‌చ్చినత‌ర్వాత‌.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బ‌దాబ‌ద‌లు కావ‌డంతోపా.. బీజేపీ ల‌బ్ధి పొందిన తీరును, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిన తీరును చూసిన త‌ర్వాత ఆప్ నిజంగానే బీజేపీకి బీ , బీ+ టీమ్‌గా మారింద‌నే చర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు గుజ‌రాత్‌లో తాము సంపాయించుకున్న సీట్లు సింగిల్ డిజిట్(5) అయిన‌ప్ప‌టికీ..  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అరవింద్ కేజ్రీవాల్ త‌ల‌పోస్తున్నారు.

అంటే,ఈ వ్యూహం వెనుక కూడా బీజేపీకి మేలు చేసే ఉద్దేశ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గుజరాత్ ఎన్నికల్లో ఆప్‌కి మిశ్రమ ఫలితాలు అందాయి. ఐదంటే ఐదే సీట్లు వచ్చినా.. జాతీయ ప్రత్యామ్నాయం అయ్యేందుకు ఇది చాల‌నేది కేజ్రీవాల్ ఉద్దేశం. ఇప్ప‌టికే  నాలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించుకున్న ఆప్ మ‌రోవైపు.. జాతీయ పార్టీగా అవ‌త‌రించింది.  

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే   దేశంలో పార్టీని విస్తరించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లోనూ ఆప్‌కు పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు. సో.. దీనిని బ‌ట్టి పార్టీ ఎదిగే క్ర‌మంలో ప్ర‌త్య‌క్షంగా ఇప్ప‌టికిప్పుడు ఒన‌గూరే ల‌బ్ధి అంటూ ఏమీ లేదు. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌ ఓటుబ్యాంకును, లేదా బీజేపీ అనుకూల ఓటు బ్యాంకును బీజేపీకి చేరువ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని మేధావులు అంటున్నారు.
 
ఇప్పటివరకు ఢిల్లీ, పంజాబ్, గోవాలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కించుకున్న ఆప్.. తాజా ఫలితంతో జాతీయ పార్టీగా మారింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేజ్రీవాల్కు.. 'జాతీయ పార్టీ' అనే ట్యాగ్ ఉపయోగపడుతుంది.

దేశంలో ప్రత్యామ్నాయం తామేనని కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇది సాకారం అయ్యేందుకు క‌నీసం 15 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి  ఈ పార్టీ ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు ప రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News