గుజరాత్‌.. తన రికార్డును తానే సవరించిన బీజేపీ!

Update: 2022-12-08 04:37 GMT
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాల స్వరాష్ట్రం గుజరాత్‌లో ప్రతిపక్షాల ఆశలు నెరవేరలేదు. మరోమారు బీజేపీకే ఆ రాష్ట్ర వాసులు జైకొడుతున్నారు. అధికారంలోకి రావాలని ఆశించిన కాంగ్రెస్, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

గుజరాత్‌ బీజేపీ ప్రచార బాధ్యతను మొత్తం తనపై వేసుకున్న నరేంద్ర మోడీ బీజేపీకి ఒంటి చేత్తో విజయం చేకూర్చిపెట్టినట్టే కనిపిస్తోంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో కనీవినీ ఎరుగని రీతిలో రోడ్‌ షోలు, ర్యాలీలు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రధానమంత్రి ఈ స్థాయిలో ప్రచారం చేయడం ఏమిటని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా మోడీ వెనక్కి తగ్గలేదు. మోడీకి తోడు మరోవైపు హోం మంత్రి అమిత్‌ షా కూడా రంగంలోకి దిగడంతో గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారాన్ని ఒడిసిపట్టబోతోంది.

ఈ వార్త రాసే సమయానికి 182 సీట్లు ఉన్న గుజరాత్‌లో ఏకంగా 152 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్‌ 19 స్థానాల్లో, ఆప్‌ 6 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

1995లో తొలిసారి బీజేపీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు 8 మంది ముఖ్యమంత్రులు ఆ పార్టీ తరఫున పనిచేశారు. 1995లో తొలిసారి కేశూభాయ్‌ పటేల్‌ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈయన ఏడాది కాలంలోపే పదవి నుంచి దిగిపోయారు. దీంతో బీజేపీకే చెందిన సురేశ్‌ మెహతా ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన దాదాపు ఏడాది కాలం అంటే 1996 సెప్టెంబర్‌ వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత శంకర్‌ సింగ్‌ వాఘేలా ఏడాది పాటు, దిలీప్‌ పారిఖ్‌ 188 రోజులపాటు సీఎంలుగా పని చేశారు.

1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం సాధించడంతో తిరిగి కేశూభాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మూడున్నరేళ్లకు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అక్టోబర్‌ 7, 2001న బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని వరుసగా గెలిపించారు. 2001 నుంచి 2014 మే వరకు వరుసగా 12 ఏళ్ల 227 రోజులు నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అత్యధిక కాలం గుజరాత్‌ సీఎంగా పనిచేసిన రికార్డు నరేంద్ర మోడీ పేరిట ఉండటం గమనార్హం.

2014 మే వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించడంతో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా మోడీ స్థానంలో ఆనందీబెన్‌ పటేల్‌కు అవకాశమిచ్చారు. ఆనందీబెన్‌ దాదాపు రెండేళ్లకుపైగా సీఎంగా పనిచేశారు.

2017లో మరోమారు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో విజయ్‌ రూపానీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన 2016 నుంచి 2021 సెప్టెంబర్‌ వరకు ఐదేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2021 సెప్టెంబర్‌లో భూపేందర్‌ భాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది. ఏడాది కాలంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఇప్పుడు మరోమారు స్పష్టమైన మెజారిటీతో గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించబోతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న భూపేందర్‌ బాయ్‌ పటేల్‌ను ఎంచుకుంటారా? లేదా కొత్త ముఖ్యమంత్రి వస్తారా అనేది వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News