గోడ కట్టిస్తే ట్రంప్ కు తెలీకుండా ఉంటుందా మోడీ?

Update: 2020-02-14 03:30 GMT
అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారు సైతం కొన్నిసార్లు అడ్డంగా బుక్ అవుతారు. చిన్నపాటి లాజిక్ మరిచిపోయి చేసే పనులు చూస్తే.. ఏమైంది వీరికి అనిపించక మానదు. ప్రధాని మోడీ ప్రస్తావన తెస్తే.. ఆయన మామూలోడా? అన్న మాటను సామాన్యుల నోటి నుంచి వస్తే.. తన చుట్టూ ఉండే వారికి సంబంధించిన ఎంపికలో మోడీ మొనగాడు భయ్ అని మేధావుల నోటి నుంచి వస్తుంది. అలాంటిది తాజాగా తీసుకున్న ఎటకారపు నిర్ణయం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24.. 25 తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 24న ఢిల్లీకి వచ్చిన ఆయన తర్వాత అహ్మదాబాద్ కు రానున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన పాల్గొనాల్సిన వేదిక వద్దకు వెళ్లే మార్గంలో ఉన్న ఒక మురికివాడ కనిపించకుండా ఉండేందుకు ఐదారు అడుగుల ఎత్తులో గోడ కట్టిస్తున్న వైనం అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చగా మారింది.

ఎంత ట్రంప్ వస్తే మాత్రం.. ఉన్న పేదరికాన్ని.. మురికివాడను చూపించుకుంటే తప్పేమిటి? అంటే.. ట్రంప్ కు మోడీ మాష్టారు తరచూ గొప్పలు చెబుతుంటారా? అన్న సందేహం కలుగక మానదు. రాష్ట్రపతి.. ప్రధాని తదితర ప్రముఖులతో పాటు.. విదేశీ ముఖ్యులు ఏదైనా ప్రాంతాన్ని పర్యటిస్తున్నారంటే.. ఆయా ప్రాంతాల్ని ప్రత్యేకంగా తయారు చేయటం మామూలే.

ఆ మధ్యన ఒక సదస్సులో పాల్గొనటానికి హైదరాబాద్ వచ్చిన ట్రంప్ కుమార్తె పుణ్యమా అని.. ఆమె ప్రయాణించిన రోడ్లు మొత్తం అద్దంలా మారిపోవటమే కాదు.. పరిసరాలు అందంగా తయారయ్యాయి. తాజాగా ట్రంప్ టూర్ పుణ్యమా అని ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందన్న అంచనాకు మించి.. చేస్తున్న ఏర్పాట్లు ఇప్పుడు ఎటకారంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. గుజరాత్ అన్నంతనే సంపన్న రాష్ట్రంగా ట్రంప్ కు మోడీ కలర్ ఇచ్చారా కొంపదీసి అన్న సందేహం రాక మానదు.

దీనికి తోడు తన ఆరేళ్ల కాలంలో దేశం చాలా డెవలప్ అయ్యిందని కోతలు కోశారా? అన్న సందేహం కలుగక మానదు. లేకుంటే.. ఇంత భారీగా కవరింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది సాధారణ ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఈ గోడకు సంబంధించిన వార్తలు ఇప్పటికే టీవీ ఛానళ్లలో మోరుమోగుతుంటే.. మీడియా.. సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా మారాయి.

అయినా మోడీ సాబ్.. మనం గోడ కట్టించినంత మాత్రాన.. కారులో వెళ్లే ట్రంప్ అద్భుతంగా ఉందని అనుకోరుకదా? ఆ మాటకు వస్తే.. ట్రంప్ వారి పర్యటన సందర్భంగా చేసిన మార్పులు.. చేపట్టిన నిర్మాణాలు.. చేసిన ఖర్చు లెక్కలు లాంటివి అమెరికా నిఘా వ్యవస్థ సేకరించి.. వాటికి సంబంధించిన నోట్ ను అధ్యక్షుల వారికి నాలుగు లైన్లలో వివరించకుండా ఉంటారా? అన్నది ప్రశ్న. ట్రంప్ వారి నిఘా వ్యవస్థ ఉండేది ఇలాంటి అంశాల్ని ప్రత్యేకంగా చెప్పేందుకేగా? అలాంటప్పుడు ఇంత ఆర్భాటం చేసి.. అడ్డంగా బుక్ అయ్యే కన్నా.. ఉన్నది ఉన్నట్లుగా చూపించేందుకు అంత ఆలోచన ఎందుకో మరి.
Tags:    

Similar News