గుజ‌రాత్‌ లో కాంగ్రెస్ గెలుపు..పాక్‌ లో ట‌పాసులు

Update: 2017-12-14 09:42 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఎన్నికలను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందనే సంగ‌తి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బీజేపీకి గెలుపు అవ‌కాశాలు తక్కువే అని మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే. ఓటమి భయంతో ఆ పార్టీ 'పాకిస్థాన్ పేరు పదేపదే ప్రయోగిస్తోందని అంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మోడీ పాకిస్థాన్‌ అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్‌ - పాకిస్థాన్‌ తో కలిసి గుజరాత్‌ లో కుట్ర రాజకీయాలు చేస్తోందని ఇటీవల ప్రధాని ఆరోపించారు.

ఇలా గుజ‌రాత్ గెలుపును త‌న భుజాన వేసుకున్న మోడీజీ బాట‌లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్  రూపానీ ఆ రాగాన్ని అందుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలోనూ పాకిస్థాన్‌ అంశాన్ని రూపానీ ప్రస్తావించారు. ఈ విష‌యం ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గుజరాత్‌ లో రెండో విడతకు ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు నిర్వహించిన ప్రచార సభలో రూపానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

`గుజరాత్‌ లో కాంగ్రెస్‌ గెలిస్తే...పాకిస్థాన్‌ లో టపాసులు కాల్చుకుంటార‌ని రూపానీ వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లంగా మారాయి.మ‌రోవైపు 'కాంగ్రెస్‌ గెలిస్తే.. పాకిస్థాన్‌ లో టపాసులు పేలతాయి' అని అమిత్‌ షా బీహార్‌ ఎన్నికల ప్రచారం వ్యాఖ్యానించారు. నాటి బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కి ఘోర పరాభవం తప్పలేదని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను రూపానీ పునరుద్ఘాటించారని అంటున్నారు. గుజరాత్‌ ప్రచారపర్వంలో ప్రధాని మోడీ - బీజేపీ నేతలు చేస్తున్న పాకిస్థాన్‌ ప్రస్తావన రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఇదిలాఉండ‌గా....గుజరాత్ మలివిడత ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం ప్రారంభమై కొనసాగుతున్న విషయం తెలిసిందే. సబర్మతీలోని రనిప్‌ పోలింగ్ కేంద్రం 115 లో ప్రధాని మోడీ ఓటు వేశారు. ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం. ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. లైనులో ఉన్నంతసేపు ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ సాధారణ వ్యక్తిలా తమతో ఓటు వేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ లో ప్రధాని తల్లి హీరాబెన్ - బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్‌ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరాబెన్ గాంధీనగర్‌ లోని ఓ పోలింగ్ బూత్‌ లో ఓటు హక్కు వినియోగించుకోగా.. నారాయణపూరలో అమిత్‌ షా ఓటేశారు.
Tags:    

Similar News