గుజ‌రాత్ ఎన్నిక‌లు.. కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టిందా?

Update: 2022-08-25 17:30 GMT
రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుకున్న విధంగా ఏదీ ముందుకు సాగే ప‌రిస్థితి లేదు. ఒక్కొక్క‌సారి అనుకు న్న‌ది ఒక్క‌టైతే.. జ‌రిగేది మ‌రొక‌టి అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంటుంది.ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కూడా కాలం క‌లిసి రావ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

కేంద్రంపై యుద్ధం చేస్తాన‌ని.. మోడీకి ప్ర‌త్యామ్నాయంగా.. కేంద్రంలో పాగా వేస్తామ‌ని.. ఆయ‌న త‌ర‌చుగా చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇత‌ర రాష్ట్రాల్లోని మోడీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రీ ముఖ్యంగా ఆయ‌న ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ను న‌మ్మారు. ఆయ‌న అయితే..ప‌క్కాగా..మోడీకి వ్య‌తిరేకి. ఎక్క‌డా లొంగే ప్ర‌స‌క్తికూడా లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆప్‌పై కేసీఆర్ ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌ఫున కేసీఆర్ ప్ర‌చారం చేస్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోయిన గుజ‌రాత్‌లో.. ఆప్ అన‌ధికార‌ ప్ర‌చారం ప్రారంభించింది.

ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్.. ఉప‌ముఖ్య‌మంత్రి  స‌హా.. అంద‌రూ.. అక్క‌డ వారానికి రెండు సార్లు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు హామీలు కూడా గుప్పిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ వెళ్లాలా?? వ‌ద్దా.. ?? అనే మీమాంశ‌లో ప‌డిపోయారు. ఆప్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న మొగ్గు చూపినా.. కేంద్రంలో మారిన ప‌రిణామాలు.. లిక్క‌ర్ కుంభ‌కోణంలో పెద్ద ఎత్తున త‌న కుమార్తె క‌విత‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు వంటివి కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఆప్‌తో కేసీఆర్ కుటుంబం లాలూచీ ప‌డింద‌ని..తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న మ‌ద్యం పాల‌సీని ఢిల్లీలో అమ‌లు చేస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వచ్చాయి. బీజేపీ నేత‌లు నిప్పులు చెరిగారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆప్ త‌ర‌ఫున ప్ర‌చారం కేసీఆర్ ప్ర‌చారానికి వెళ్తే..

బీజేపీ నేత‌ల దాడి మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంటుంద‌ని.. ఇది అంతిమంగా తెలంగాణ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని.. కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో ఆయ‌న గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు దూరంగానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ ప‌రిణామం..కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల‌పైనా ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News