ఇరాన్ పార్ల‌మెంటులో ఉగ్ర‌దాడి

Update: 2017-06-07 09:16 GMT
ఉగ్ర‌వాదులు చెల‌రేగిపోయారు. ప‌లు దేశాల మీద త‌మ పంజా విసిరినా.. ఇరాన్ మీద దాడుల‌కు దిగ‌ని ఉగ్ర‌వాదులు తాజాగా ఆ దేశాన్ని కూడా విడిచిపెట్ట‌లేదు. వెంట‌వెంట‌నే ఆ దేశంపై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డుతున్న వైనంతో ఇరాన్ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. దేశంలో అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ఉన్న‌ట్లుగా భావించే ఇరాన్ పార్ల‌మెంటులోకే ఉగ్ర‌వాదులు దూసుకెళ్ల‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ షాక్ నుంచి బ‌య‌ట‌కు రాక‌ముందే.. వ‌రుస‌గా మ‌రో రెండుచోట్ల ఉగ్ర‌దాడుల‌కు దిగ‌టం ఆ దేశాన్ని దిగ్భాంత్రికి గురి చేస్తోంది.

దాదాపు ఒకే స‌మ‌యంలో ఇరాన్ లోని మూడు ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగారు. దేశ రాజ‌ధాని టెహ్రాన్‌ లోని పార్ల‌మెంటు భ‌వ‌నం లోకి ముగ్గురు నుంచి ఐదుగురు ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. కోమెనీ ప్రార్థ‌నా స్థ‌లంలోనూ.. మెట్రో స్టేష‌న్ లోనూ ఉగ్ర‌వాదులు దాడులు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. మెట్రో స్టేష‌న్ లో దాడుల విష‌యంపై స్ప‌ష్ట‌త రావటం లేదు.

తాజా దాడిలో ఒక మ‌హిళా ఉగ్ర‌వాది సైతం పాలు పంచుకున్న‌ట్లుగా భావిస్తున్నారు. తాజా ఘ‌ట‌న‌లో మొత్తం ఎనిమిది మంది వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. పార్ల‌మెంటులో న‌క్కిన ఉగ్ర‌వాదుల కార‌ణంగా  భారీ ముప్పు వాటిల్లొచ్చ‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌.. టెహ్రాన్‌ లోని ప్ర‌ఖ్యాత విప్ల‌వ‌కారుడు రుహెల్లా ఖోమెనీ ప్రార్థ‌నాస్థ‌లాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ఉగ్ర‌ఘ‌ట‌న‌తో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌.. పార్లమెంటులోకి ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదులు ఏకే 47 తుపాకులు.. కోల్డ్ పిస్ట‌ల్ క‌లిగి ఉన్న‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. చాలాకాలం త‌ర్వాత ఇరాన్ లో జ‌రిగిన దాడికి భ‌ద్ర‌తా వ‌ర్గాలు ఉలిక్కిప‌డ్డాయి. ఈ దాడికి కుట్ర పాక్‌ లో జ‌రిగి ఉండొచ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమైనా ఒకేసారి.. ఇంత భారీగా ఉగ్ర‌దాడి ఇరాన్ లో పెను ప్ర‌కంప‌న‌ల్ని సృష్టిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News