హైదరాబాద్ లో గన్ కల్చర్: మాదాపూర్ ఫైరింగ్ తో ఉలికిపాటు

Update: 2022-08-03 01:30 GMT
ముంబై నగరం.. మాఫియాకు, గన్ కల్చర్ కు దేశంలో పాపులరైంది.  అయితే ప్రశాంతమైన హైదరాబాద్ లోనూ ఈ మధ్య గన్ కల్చర్ పెరిగిపోయింది. నిత్యం ఏదో ఒక ఘటనతో కలకలం రేపుతోంది. అక్రమాయుధాలతోనే అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మాదాపూర్ ఫైరింగ్ తో ఉలికిపాటు నెలకొంది. నగరంలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.

ఇటీవల నగరంలో స్నాచింగులకు పాల్పడిన దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన హెడ్-కానిస్టేబుల్ ను కత్తితో పొడిచిన కలబురిగి స్నాచర్లు ఇషాన్, రాహుల్ తమ వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నారు. ఈ విషయం గురువారం వారిని అరెస్ట్ చేసిన సందర్భంలోనే ఇది వెలుగులోకి వచ్చింది.

సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్లుగా మారిన ఇద్దరు నేర చరితుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారితీసింది. ఇలా రాజధానిలో తరచూ తుపాకీ వినియోగమనేది కలకలం సృష్టిస్తోంది.

ఇటీవల కాలంలో నగరంలో చిన్న వివాదానికి తుపాకులు, తూటాలు తెరపైకి వస్తున్నాయి. తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు-అక్రమాయుధాలతోనే జరుగుతున్నాయి. రాజధానిలో ఉన్న లైసెన్స్ డ్ ఆయుధాలకు వాటికి రెండు రెట్లకు పైగా అక్రమ ఆయుధాలతోనే జరుగుతున్నాయన్నది అనధికారిక అంచనా.. ఇవి అనేక ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

బీహార్, ఉత్తరప్రదేశ్ ల్లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదాపు 90శాతం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఒకప్పుడు కేవలం తపంచాలకు మాత్రమే పరిమితై ఉన్న ఈ పరిశ్రమలు ఇప్పుడు అత్యాధునికమైనవీ తయారు చేస్తున్నాయి.

బీహార్ లోని ముంగేర్, గయా, యూపీలోని నాన్ గల్, హసన్ పూర్ తదితర ప్రాంతాల్లో తయారవుతున్న నాటు తుపాకులకు సేఫ్టీ లాక్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. నగరానికి సరఫరా అవుతున్న ఈ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటెడ్ రకాలతో పాటు అతి చిన్న సైజులో ఉండే సింగిల్ షార్ట్ గన్స్ కూడా ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. కేవలం డిఫెన్స్, పోలీస్ శాఖలు మాత్రమే వాడే ప్రొహిబిటెడ్ బోర్ గా పిలిచే పాయింట్ 9 ఎంఎంలనూ అక్కడి వ్యక్తులు నాటు పద్ధతిలో తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ కు ఈ ఆయుధాలు బీహార్, ఉత్తరప్రదేశ్ ల నుంచి వచ్చి చేరుతున్నాయని చెబుతున్న అధికారులు అవి వస్తున్న మార్గాలపై మాత్రం కన్నేసి ఉంచలేకపోతున్నారు. ఫలితంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.
Tags:    

Similar News