రాయలసీమ టు అమరావతి ఓకే..

Update: 2015-09-24 05:48 GMT
గుంటూరు – కర్నూలు రహదారికి మహర్దశ పట్టింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఈ రహదారి అనుసంధానమై ఉండడంతో కేంద్ర ప్రభుత్వం దీనికి జాతీయ రహదారి హోదా కల్పించింది. ప్రస్తుతం అత్యంత అధ్వానంగా ఉన్న ఈ రహదారికి మోక్షం లభించడమే కాదు.. రాయలసీమకు, నవ్యాంధ్ర రాజధానికి మధ్య అద్భుతమైన రహదారి సౌకర్యం  కూడా ఏర్పడనుంది.

గుంటూరు నుంచి కర్నూలు వరకు 296 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంది. కర్నూలు బదులు గుంటూరును రాజధానిని చేస్తుండడంతో ఈ రహదారిని జాతీయ రహదారిని చేయడంతోపాటు మరో రహదారి నిర్మించాలని చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు మాట్లాడారు కూడా. దాంతో ఆయన దీనిని జాతీయ రహదారి చేయడానికి అంగీకరించారు. దాంతో భారీగా నిధులను కూడా విడుదల చేయనున్నారు. కర్నూలు - ఆత్మకూరు - దోర్నాల - వినుకొండ - నరసరావుపేట మీదుగా ఈ రహదారి అమరావతికి వెళుతుంది. ప్రస్తుతం రెండు లైన్ల రహదారిగా ఉన్న దీనిని అతి త్వరలోనే నాలుగు లైన్ ల రహదారిగా మార్చనున్నారు. అమరావతి నిర్మాణం జరిగితే రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా రహదారులను విస్తరించడమూ ముఖ్యమే. పెరిగే రాకపోకలకు అనుగుణంగా గుంటూరు - కర్నూలు మధ్య రహదారిని విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అన్ని నిధులనూ కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయనుంది.
Tags:    

Similar News