గుంటూరు తొక్కిసలాట.. ఏ1 నిందితుడు అరెస్ట్‌!

Update: 2023-01-02 10:32 GMT
జనవరి 1 గుంటూరులో టీడీపీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీడీపీ సానుభూతిపరుడు, ఎన్నారై, ఉయ్యూరు ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఉయ్యూరు శ్రీనివాస్‌.. చంద్రన్న కానుక, అన్నగారి జనతా వస్త్రాలు ఇస్తామని కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి విజయవాడ ఏలూరు రోడ్‌లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏ–1గా ఉన్న శ్రీనివాస్‌పై గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీసు స్టేషన్లలో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు.

కాగా, ఇటీవల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో 8 మంది తొక్కిసలాటలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే గుంటూరులో కొత్త సంవత్సరం రోజు ఈ దారుణం జరిగింది.

చంద్రన్న కానుకులు, అన్నగారి జనతా వస్త్రాలు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం చేయడంతో సభకు పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు తరలివచ్చారు. 3000 మందికి టోకెన్లు ఇచ్చి 30 వేల సభకు తీసుకొచ్చారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారని ఆరోపిస్తున్నారు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు ముందుకు దూసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో ఏ1 నిందితుడైన శ్రీనివాస్‌ ను అరెస్టు చేశారు.

మరోవైపు టీడీపీ నేతలు ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తున్నారు. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు సభలకు పోలీసులు సరైన భద్రత కల్పించడం లేదని, ప్రజలను నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు తొక్కిసలాట ఘటన జరిగిందని మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News