గల్లా జయదేవ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2016-02-27 11:46 GMT
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ప్రమాదం తప్పింది. ఆయన తన నియోజకవర్గంలోని మేడికొండూరులో శనివారం ఉదయం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.6 కోట్లతో నిర్మించనున్న రెండు వంతెనల శంకుస్థాపన అనంతరం తిరుగు ప్రయాణం కాగా దారిలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

పేరేచర్ల వంతెనపైనుంచి జయదేవ్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కాన్వాయ్ లోని వాహనాలే ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. బాగా వేగంగా వెళ్తుండడంతో వరుసగా ఒకదాన్నొకటి ఢీకొని మొత్తం అయిదు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తు ఎంపీ ప్రయాణిస్తున్న వాహనం పెద్దగా దెబ్బతినకపోవడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కానీ, అపాయం కానీ కలగలేదు.

మేడికొండూరులో వంతెనలకు ఆయన ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. కాగా విషయం తెలిసిన టీడీపీ నేతలు పలువురు జయదేవ్, పుల్లారావులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం కనుక్కున్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.
Tags:    

Similar News