తాజా ప్రియుడితో మాజీ ప్రియుడిపై హత్యాయత్నం.. సీరియల్ నటి అరెస్ట్

Update: 2022-11-02 16:03 GMT
నాలుగేళ్లుగా ప్రేమిస్తూ సహజీవనం చేస్తున్న తోటి క్యారెర్టర్ ఆర్టిస్ట్ పెళ్లి అనేసరికి దూరం పెట్టింది ఓ బుల్లితెర నటి.  వేరే నటుడితో సహజీవనం మొదలుపెట్టింది. గొడవకు దిగిన మాజీప్రియుడిని బిల్డింగ్ మీద నుంచి తోసేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మాజీ ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది.    ఈ కేసు ఆ సీరియల్ నటి మెడకి చుట్టుకుంది.

‘గుప్పెడంత మనసు’, ‘గుండమ్మ కథ’ వంటి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తోన్న జూనియర్ ఆర్టిస్ట్ ‘నాగవర్ధిని’ హత్యాయత్నం కేసులో ఇరుక్కుంది. తాజా ప్రియుడు శ్రీనుతో కలిసి మాజీ ప్రియుడు సూర్య నారాయణపై హత్యాయత్నం చేసింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు తాజాగా నాగావర్ధిని, శ్రీనులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లోని కృష్ణానగర్ బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన సూర్యనారాయణ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

శ్రీకాకుళం కు చెందిన తిరుమల్ రెడ్డి సూర్యనారాయణ సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ నాగవర్ధినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. సహజీవనం చేసే వరకూ వెళ్లింది. సూర్య గతం నుంచి నివాసం ఉంటున్న బిల్డింగ్ లోనే రెండో అంతస్థులో ఇంటిని అద్దెకు తీసుకొని నాగవర్ధినితో సహజీవనం చేశాడు.

నాలుగు నెలల క్రితం సూర్య, నాగవర్ధినిని పెళ్లి చేసుకుందాం అని కోరాడు. దానికి నాగవర్ధిని ఒప్పుకోకపోవడంతో గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. సూర్య అదే భవనంలో నాలుగో ఫ్లోర్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.

ఇక క్రమంలో రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో నాగవర్దినికి పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి నాలుగు నెలలుగా ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం తెలుసుకున్న సూర్యనారాయణ తాజాగా నాగవర్ధినిని కలిసి గట్టిగా నిలదీశాడు. శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించాడు. వదిలేయాలని కోరారు.

ఆదివారం రాత్రి సూర్యనారాయణ నేరుగా నాగవర్ధిని ఫ్లాట్ లో కి వెళ్లగా అక్కడ శ్రీనివాస్ రెడ్డితో ఉండడంతో గొడవ జరిగింది. వీరి మధ్య తోపులాట జరిగింది. సూర్యనారాయణ ఇంట్లో నుంచి వరాండాలోకి తీసుకొచ్చిన శ్రీనువాస్ రెడ్డి అతడిని నాగవర్ధినితో కలిసి తోసేశాడు. రెండో అంతస్థు నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సూర్యనారాయణను అతడి స్నేహితులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

తనకు సంబంధం లేదని.. సూర్యనారాయణ ఎవరో తెలియదని.. పడిపోయాడని బుకాయించింది నాగవర్ధిని. కానీ సూర్యనారాయణ స్నేహితులు వారిద్దరూ కలిసి ఉన్న క్లోజ్ గా ఉన్న ఫొటోలు.. సహజీవనం ఆధారాలు చెప్పడంతో విచారించిన పోలీసులకు ఈ హత్యాయత్నం కేసులో నాగవర్ధిని-శ్రీనులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News