రీల్ ను మరిపించే రియల్ గేమ్ వీడియోను మీరు మిస్ కావొద్దు

Update: 2021-08-03 03:30 GMT
రీల్ లో మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. ఏవో కొన్ని తప్పించి.. మిగిలిన సినిమాలన్ని శుభం కార్డుతోనే ముగుస్తాయి. ఇక.. నరాలు తెగే ఉత్కంటకు గురి చేసే స్ప్రోర్ట్స్ డ్రామాలైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా.. మరెంత డ్రామా నడిచినా చివరకు విజయం మాత్రం మన సొంతమవుతుంది. కానీ..రియల్ సీన్ అలా ఉండదు. రీల్ కు పూర్తి భిన్నంగా.

అయితే.. తాజాగా జరుగుతున్న ఒలింపిక్స  లో బలమైన ఆస్ట్రేలియా టీంతో మన మహిళా హాకీ టీం సాధించిన విజయం చూసినప్పుడు మాత్రం అప్రయత్నంగా రీల్ సీన్ గుర్తుకు రాక మానదు. ఒకప్పుడు భారత హాకీ టీం మైదానంలోకి అడుగు పెడుతుందంటే చాలు.. వణికేవి. పతకాల్ని కొల్లగొట్టేది. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రభ మసకబారింది. సినిమాల్లో మన విజయాల్ని చూసుకొని మురిసిపోవటమే కాదు.. వాస్తవంలో మాత్రం అలాంటివి తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి.

ఆ లోటును తీర్చేలా తాజాగా మన మహిళా హాకీ జట్టు అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. 49 ఏళ్ల తర్వాత షురుషుల హాకీ జట్టు సెమీస్ లోకి అడుగు పెడితే.. మన అమ్మాయిలు చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరుకున్నారు. తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో అంతర్జాతీయ హాకీలో తిరుగులేని ఆస్ట్రేలియా జట్టు మీద చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. మూడుసార్లు ఒలింపిక్స్ విజేత.. ప్రపంచ రెండో ర్యాంక్ జట్టును ఓడించటం మనమ్మాయిలు సాధించిన గొప్ప ఘన విజయంగా చెప్పాలి. లీగ్ దశలో వరుసగా మ్యాచులు ఓడిన ఈ అమ్మాయిలు.. తర్వాత నుంచి వరుస పెట్టి విజయాలు సాధించటమే కాదు..ఇప్పుడు సెమీస్ కు దూసుకెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది.

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు ఆడాయి. బలమైన ఆస్ట్రేలియా జట్టుపై మనమ్మాయిలు ప్రదర్శించిన తెగువ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దుర్భేద్యమైన డిఫెన్సుకు మారుపేరైన ఆసీస్ పై టీమిండియా అమ్మాయిలు తమకు లభించిన ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచటంతో విజయం సాధించటంతో అపూర్వ విజయం సొంతమైంది.

 దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు చేసిన తొమ్మిది దాడుల్ని విజయవంతంగా అడ్డుకోవటంతో భారత గోల్ కీపర్ సవిత కీలక పాత్ర పోషించింది. ఏడు పెనాల్టీ కార్నర్లు.. రెండు ఫీల్డ్ గోల్స్ ను విజయవంతంగా అడ్డుకోవటం అంత సులువేం కాదు. ఇక.. సెమీస్ లో అర్జెంటీనాతో తలపడనుంది. ఆ కీలక మ్యాచ్ లో గెలిస్తే.. భారత మహిళా హాకీ చరిత్ర మలుపు తిరగటం ఖాయం.


Full View





Tags:    

Similar News