ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన గుత్తా.. రెండు స్టెంట్లు వేసి శస్త్రచికిత్స

Update: 2021-03-08 04:51 GMT
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ఆసుపత్రిలో చేరటమే కాదు.. తాజాగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేవారు. శనివారం రాత్రి నల్గొండ లోని ఇంట్లో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున మూడు గంటల వేళలో ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు.

దీంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన్ను వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుత్తా గుండెకు వెళ్లే రెండు చోట్ల రక్త నాళాలు పూడుకుపోయినట్లుగా గుర్తించారు. వెంటనే చికిత్స చేసి.. రెండు స్టెంట్లు వేశారు.

సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. గుత్తా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురునేతలు గుత్తాను ఆసుపత్రిలో పరామర్శించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ఆయన్ను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు చెబుతున్నారు. 
Tags:    

Similar News