ఈ స్టైలీష్ కుర్రాడు ఏకంగా రూ.100 కోట్లు ఏసేశాడు

Update: 2019-12-20 04:41 GMT
ఖరీదైన కారు ముందు స్టైలీష్ కుర్రాడిలా కనిపించే ఇతగాడి గురించి అసలు విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆధ్యాత్మికత ముసుగేసుకొని అమాయకులైన భక్తులపై అతగాడి అధ్యాత్మికత వల విసిరితే ఎంతటోడైనా ఇట్టే చిక్కుకోవాల్సిందే. అతడి మాటలకు ఫిదా కావటమే కాదు.. కోట్లాది రూపాయిలు అతడికి ఇచ్చేసి అడ్డంగా బుక్ అయిపోతుంటారు. ఇంతకీ అతడెవరన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన 34 ఏళ్ల గిరీశ్ కుమార్.

మాటలతో మాయ చేయటమే కాదు.. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తాడు. అధ్యాత్మికం మొదలు అత్యాధునిక బిజినెస్ ల వరకూ అతడి మాటలు కోటలు దాటతాయి. అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన ఈ కుర్ర బాబు రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.100 కోట్లను దోచేసిన వైనం తెలిస్తే నోట మాట రాదంతే. గత ఏడాది రూ.60 కోట్లు దోచేసిన అతగాడి లీలల గురించి పోలీసులకు అందిన ఫిర్యాదుతో అతడ్ని జైలుకు పంపారు. అయినా పరివర్తన రాకపోగా.. తనకున్న పలుకుబడితో జైలు నుంచి బయటకు వచ్చి ఈ ఏడాదిలో మరో రూ.40 కోట్లను దోచేసిన ఇతడ్ని తాజాగా ఎస్ఆర్ నగర్ పోలీసులు జైలుకు పంపారు.

ఇంటర్ తో చదువు ఆపేసిన గిరీశ్ జనాల్ని మోసం చేయటంలో మాత్రం మాస్టర్ డిగ్రీ ఇచ్చేయొచ్చు.తనకు బాలాత్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చిందని.. తాను అమ్మవారికి సమస్యల్ని చెప్పి పరిష్కరిస్తానన్న తియ్యటి మాటలతో బుట్టలో వేస్తాడు. ఏడేళ్ల క్రితం తన అధ్యాత్మిక ప్రవచనాల కోసం ఒక కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఒక్కో క్లాస్ కు రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకూ వసూలు చేసేవాడు. ముప్ఫై స్టార్ట్ ప్ లు స్టార్ట్ చేసినట్లుగా చెప్పేసి.. మల్టీ మార్కెటింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించి కోట్లు నొక్కేశాడు. తాజాగా తమకు అందిన ఫిర్యాదుతో ఈ దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఇతగాడి దగ్గరున్న అత్యంత ఖరీదైన కార్లను చూసి పోలీసులు సైతం అవాక్కు అయ్యే పరిస్థితి. 
Tags:    

Similar News