జ‌గ‌న్ ఇష్తార్ విందు..ఏపీ బీజేపీకి విలాస కార్య‌క్ర‌మం?

Update: 2019-06-05 04:19 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేస్తున్న హామీల‌తో అధికారం చేప‌ట్టిన స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పాజిటివ్ రెస్పాన్స్ రావ‌టం తెలిసిందే. ఈ ధోర‌ణిని ఏ మాత్రం ఊహించ‌ని విప‌క్షాలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భారీ ప్ర‌జాద‌ర‌ణతో విజ‌యం సాధించిన జ‌గ‌న్ లాంటి ప్ర‌జానేత‌పై విమ‌ర్శ‌లు చేస్తే.. మైలేజీ త‌ర్వాత మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మీద పంచ్ లు వేసే కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు బీజేపీ నేత‌లు.

ఏదో ఒక‌టి వేలెత్తి చూపించ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న క‌మ‌ల‌నాథులు.. తాజాగా జ‌గ‌న్ ను ఉద్దేశించి చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు జ‌నాగ్ర‌హానికి గుర‌య్యేలా చేస్తున్నాయి. ఐదేళ్ల బాబు పాల‌న ముగిసి.. జ‌గ‌న్ పాల‌న మొద‌లై స‌రిగ్గా వారం కూడా కాని వేళ‌.. ఆయ‌నపై ఏదోలా విమ‌ర్శ‌లు చేసేందుకు ప‌డుతున్న బీజేపీ తాప‌త్ర‌యం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు తాజాగా చేసిన ట్వీట్ ప‌లువురి అగ్ర‌హానికి గుర‌య్యేలా చేసింది.

ప‌విత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోద‌రులు ఎక్కువ‌గా ఉండే గుంటూరు ప‌ట్ట‌ణంలో సీఎం జ‌గ‌న్ ఇఫ్తార్ విందును నిర్వ‌హించారు. అయితే..  ఈ విందును త‌ప్పుడు కార్య‌క్ర‌మం అన్న‌ట్లుగా ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌టం విశేషం. మ‌తాల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల కోసం విలువైన ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌టం స‌బ‌బు కాద‌న్న‌ది జీవీఎల్ ఆరోప‌ణ‌.

జీవీఎల్ చేసిన ట్వీట్ కు రివ‌ర్స్ లో పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బాబు పాల‌న‌తో వైఎస్ జ‌గ‌న్ పాల‌న పోల్చ‌టం ఏమిటి? చ‌ంద్ర‌బాబు పాల‌నలా.. మీ పాల‌న‌లో వృధా ఖ‌ర్చులు ఉండ‌వని ఆశిస్తున్నా అంటూ వైఎస్జ‌గ‌న్ ను జీవీఎల్ ట్యాగ్ చేయ‌టంపై వైఎస్సార్ కాంగ్రెస్ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌తాల్ని ఉద్దేశించి జాతీయ స్థాయిలో బీజేపీ నేత‌లు చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల మాటేమిటి? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. గుంటూరులో జ‌గ‌న్ ఇచ్చిన ఇఫ్తార్ విందు ఖ‌ర్చు ప్ర‌స్తావ‌న‌పై జ‌గ‌న్ పార్టీ అభిమానులు ప‌లువురు ఆగ్ర‌హంతో వ్యాఖ్య‌లుచేస్తున్నారు. జీవీఎల్ కు సిల్లీ కామెంట్స్ చేయ‌టం అదో స‌ర‌దా అని.. సిల్లీ కామెంట్స్ తో సీరియ‌స్ గా విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటేన‌ని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల మీద ఇంత చౌక‌బారు వ్యాఖ్యాలా? అన్న విస్మ‌యం ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News