ట్రాయ్ ఛైర్మ‌న్ కు ఆధార్ షాకిచ్చిన ఫ్రెంచ్ హ్యాక‌ర్

Update: 2018-07-31 05:05 GMT
ఆధార్ భ‌ద్ర‌మేనా? అన్న ప్ర‌శ్న‌కు ఎవ‌రైనా స‌రే.. ఫుల్ సేఫ్ అని చెప్పేస్తారు. అలా చెప్పే ముందు కాస్త వెనుకా ముందు ఆలోచించుకొని చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతం తెలిస్తే అర్థం కావ‌ట‌మే కాదు.. కొత్త భ‌యాలు ముంచెత్త‌టం ఖాయం. ఆధార్ నంబ‌ర్ ఒక్క‌టి తెలిస్తే చాలు.. బ‌తుకు బ‌స్టాండింగ్ చేయ‌టానికి బోలెడ‌న్ని మార్గాలున్నాయ‌న్న విష‌యాన్ని తాజాగా ఫ్రూవ్ చేశాడో ఫ్రెంచ్ ఎథిక‌ల్ హ్యాక‌ర్‌. అది కూడా అల్లాట‌ప్పా వ్య‌క్తిది కాకుండా.. ట్రాయ్ ఛైర్మ‌న్ లాంటి పెద్దాయ‌నకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు.

తాజా ప‌రిణామంతో 12 అంకెల విశిష్ఠ సంఖ్య‌గా పేరున్న ఆధార్ భ‌ద్ర‌త డొల్లేనా? అన్న సందేహాలు పుట్టుకు రావ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్తులో భారీ ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యేలా తాజా ఉదంతం స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. ఆధార్ సుర‌క్షిత‌మేన‌ని.. ఎవ‌రూ ఆ డేటాను క్రాక్ చేయ‌లేర‌ని.. అలా సాధ్యం కాద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పుకొచ్చారు ట్రాయ్ (టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా).

అలానా.. అయితే.. మీ ఆధార్ సంఖ్య‌ను చెప్పండి బాసూ.. ఏం జ‌రుగుతుందో చూద్దురు కాని అన్న మాట‌కు రోషం వ‌చ్చిన శ‌ర్మ‌గారు.. వెనుకా ముందు చూసుకోకుండా త‌న 12అంకెల ఆధార్ సంఖ్య‌ను బ‌య‌ట‌పెట్టేశారు. ఇంత వ‌ర‌కూ క‌థ ఓకే అయినా.. ఇక్క‌డే ఊహించ‌ని మ‌లుపు తీసుకుంది. తాను సేఫ్ అని గొప్ప‌ల‌కు పోయే ట్రాయ్ ఛైర్మ‌న్‌కు దిమ్మ తిరిగే షాక్ ఒక‌టి త‌గిలింది. శ‌ర్మ స‌వాల్ ను స్వీక‌రించిన ఇలియ‌ట్ ఆల్డ‌ర్స‌న్ అనే ఫ్రెంచ్ సైబ‌ర్ నిపుణుడు శ‌ర్మ‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేశారు. ఆయ‌న పేరు.. ఇంటి అడ్ర‌స్ తో పాటు.. ఆయ‌న బ‌ర్త్ డేట్‌.. ఫోన్ నెంబ‌రు.. ఆయ‌న భార్య పేరుతో స‌హా అన్ని వివ‌రాలు బ‌య‌ట‌పెట్టేశారు.

ఇక్క‌డితో ఆగి.. ఇదెలా సాధ్య‌మ‌న్న త‌ర్కంతో కాస్త బుర్ర పెడితే బాగుండేది. కానీ.. అదేమీ చేయ‌ని శ‌ర్మ‌.. ఆధార్ మీద త‌న‌కున్న న‌మ్మ‌కంతో మ‌రోసారి పెద్ద మాటను అనేశారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇలాంటి స‌మాచారం బోలెడంత దొరుకుతుంద‌న్న మాట‌తో అల్డ‌ర్ స‌న్ తో పాటు.. పుష్పేంద్ర సింగ్‌.. క‌నిష్క్‌.. అనివ‌ర్ అర‌వింద్‌.. క‌ర‌ణ్ సైనీ త‌దిత‌ర ఎథిక‌ల్ హ్యాక‌ర్స్ రంగంలోకి దిగారు.

శ‌ర్మ బ్యాంక్ ఖాతాతో పాటు.. భీమ్‌.. పేటీఎం.. ఖాతాల స్క్రీన్ షాట్ల‌తో పాటు.. ఐఎంపీఎస్ ద్వారా ఆయ‌న ఖాతాకు రూపాయిను పంపి షాకిచ్చారు. ఆ వివ‌రాల్ని.. లావాదేవీల ఐడీల‌తో స‌హా ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. శ‌ర్మ‌కు సంబంధించి 14 ర‌కాల వివ‌రాల్ని వారు బ‌య‌ట‌పెట్టారు. మీ అనుమ‌తి లేకుండా మీ బ్యాంకు ఖాతాకు డ‌బ్బులు పంపామంటే.. దాని ద్వారా మిమ్మ‌ల్ని బ్లాక్ మొయిల్ చేసే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు.

మ‌నీ లాండ‌రింగ్‌.. ఇత‌ర ముప్పులు పొంచి ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇది స‌రిపోద‌న్న‌ట్లు శ‌ర్మ జీమొయిల్ ఖాతా హ్యాక్ అయ్యింద‌న్న విష‌యంతో పాటు.. వెంట‌నే పాస్ వ‌ర్డ్ మార్చుకోవాల‌న్న సూచ‌న కూడా చేశారు. అంతేకాదు.. శ‌ర్మ‌కు ఒక విన్న‌పాన్ని చేశారు. ద‌య‌చేసి.. ఇలాంటి స‌వాళ్ల‌ను విస‌రొద్ద‌ని.. మీరు మీ నంబ‌రునుఆన్ లైన్లో షేర్ చేస్తే.. ఇత‌ర వివ‌రాలు క‌నుక్కోవ‌టం పెద్ద క‌ష్టం కాద‌ని.. శ‌ర్మ వివ‌రాల‌న్నీ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని.. వాటిల్లో కొన్ని మాత్ర‌మే తాను బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా ఆల్డ‌ర్ స‌న్ వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే.. శ‌ర్మ వివ‌రాల్ని గూగుల్ సెర్చ్ ద్వారా సంపాదించార‌ని.. అంతేకానీ.. ఆధార్ సంఖ్యా ఆధారంగా కాద‌ని యూఐడీఏఐ పేర్కొంది. ఎప్ప‌టిలానే ఆధార్ సేఫ్ అన్న పాత పాట‌నే పాడింది. పాట పాడ‌టం త‌ర్వాత‌.. పాట‌లో రాగాలు ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అన్న ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవ‌టం మంచిది. మిగిలిన ముచ్చ‌ట్లు ఎలా ఉన్నా.. మీ ఆధార్ నెంబ‌ర్ ను ఎవ‌రికి పడితే వారికి ఇవ్వొద్దు సుమా?


Tags:    

Similar News