జిన్నా తొలి ప్ర‌ధాని కావాల్సింద‌న్న బీజేపీ అభ్య‌ర్థి!

Update: 2019-05-12 05:08 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లేమో కానీ.. ఓట్ల కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. హ‌ద్దులు దాటేసేలా ఉన్న నేత‌ల మాట‌లు కంప‌రం పుట్టిస్తున్నాయి. రాజ‌కీయంగా విభేదాలు ఎన్నో ఉండొచ్చు.. అంత మాత్రాన పోయినోళ్ల మీద అదే ప‌నిగా నోరు పారేసుకోవ‌టం మంచిది కాదు. ఇప్ప‌టికే నెహ్రూ మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ అండ్ కో ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వీరంద‌రికి మించిన‌ట్లుగా బీజేపీ అభ్య‌ర్థి ఒక‌రు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దేశానికి తొలి ప్ర‌ధానిగా జిన్నా కావాల్సింద‌ని.. అదే జ‌రిగితే దేశ విభ‌జ‌న జ‌రిగేది కాద‌న్నారు. ఈ వ్యాఖ్య చేసిన బీజేపీ అభ్య‌ర్థి గుమ‌న్ సింగ్ దామ‌ర్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని రాట్లం- ఝుబువా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న జిన్నా మీద ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. దేశ విభ‌జ‌న‌కు నెహ్రూనే కార‌ణ‌మ‌న్న ఆయ‌న‌.. నెహ్రూ కానీ అప్ప‌ట్లో ప‌ట్టుబ‌ట్ట‌క‌పోయి ఉంటే దేశం రెండు ముక్క‌లు అయ్యేదే కాద‌న్నారు. జిన్నా న్యాయ‌వాది..  విద్యావంతుడు అని అన్నారు. ఆ స‌మ‌యంలో జిన్నాను దేశ ప్ర‌ధానిని చేసి ఉంటే.. దేశ విభ‌జ‌న అవ‌స‌రం వ‌చ్చేది కాద‌న్నారు. ఒక‌వేళ అదే నిజం అనుకుందాం.

మ‌రింత విద్యావంతుడైన జిన్నా.. పాకిస్థాన్ కు ప్ర‌ధాని అయి.. చేసిందేమిటి?  జిన్నా తొలి ప్ర‌ధాని అయిన పాక్ ఈ రోజున ఎలా ఉంది?  నెహ్రూ తొలి ప్ర‌ధాని అయిన భార‌త్ ఎలా ఉంది?  ఓట్ల కోసం నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం నేటికి బాగానే ఉన్నా.. భ‌విష్య‌త్ త‌రాలు ఇంత‌టి నిర్ల‌క్ష్య‌పూరిత వ్యాఖ్య‌ల్ని క్ష‌మించ‌ద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. పొరుగింటి పుల్ల‌కూర రుచి అన్న‌ట్లుగా.. నెహ్రూను పొగ‌డ‌కున్నా ఫ‌ర్లేదు కానీ.. దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన జిన్నాను ఇంత‌లా పొగ‌డ‌టం స‌రికాదు. దేశ‌భ‌క్తికి నిలువెత్తు రూపంగా చెప్పుకునే బీజేపీ.. త‌న అభ్య‌ర్థి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఏమ‌ని బ‌దులిస్తుందో చూడాలి.


Tags:    

Similar News