అభినంద‌న్ ను మోడీ ఎంత‌లా వాడారంటే?

Update: 2019-04-22 04:34 GMT
గెలుపు కోసం ప్ర‌ధాని మోడీ దేనికైనా రెఢీ అంటార‌న్న మాట కొంద‌రి నోట వినిపించిన‌ప్పుడు ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు. మోడీలోని మంచి కోణాన్ని ఏ మాత్రం చూడ‌రే అంటూ విరుచుకుప‌డుతుంటారు. ఎన్నిక‌ల వేళ ఏ అంశాల్ని ప్ర‌స్తావించ‌కూడ‌దో.. అలాంటి అంశాల్ని చెబుతూ.. మోడీ మాస్టారు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. తీవ్ర‌చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ర‌క్ష‌ణ‌ వ్య‌వ‌హారాలు.. పాక్ తో ఆ మ‌ధ్య చోటు చేసుకున్న ఎపిసోడ్ ను   ప్ర‌స్తావించ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న మాట‌ను ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌న‌లంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అణ్వాయుధాల బ‌ట‌న్ నొక్కుతామ‌ని.. ప‌దే ప‌దే పాక్ హెచ్చ‌రిక‌లు చేయ‌టాన్ని ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మోడీ.. భార‌త్ ద‌గ్గ‌ర ఉన్న అణ్వాయుధాలు దీపావ‌ళి వేడుక‌ల కోసం దాచిన‌వి కావ‌న్న విష‌యాన్ని పాకిస్థాన్ ఇప్ప‌టికైనా గ్ర‌హించాలంటూ దాయాది మీద విరుచుకుప‌డ్డారు మోడీ.

అంతేనా.. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్ ను దేశానికి సుర‌క్షితంగా అప్ప‌గించ‌కుంటే తీవ్ర‌మైన ప‌రిణామాలు ఉంటాయ‌ని తాను గ‌ట్టిగా హెచ్చ‌రించినందువ‌ల్లే పాక్ తోక ముడిచింద‌ని మోడీ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. తాను వార్నింగ్ ఇచ్చిన త‌ర్వాతి రోజు.. ప‌రిస్థితి చేయి దాటితే ప్ర‌యోగించ‌టానికి 21 క్షిప‌ణుల‌ను మొహ‌రించిన‌ట్లుగా ఆయ‌న పేర్కొని సంచ‌ల‌నం సృష్టించారు.

21 క్షిప‌ణులు మొహ‌రించిన విష‌యాన్ని పాక్ కు అమెరికా సీనియ‌ర్ అధికారులు తెలియ‌జేశార‌ని.. అదే రోజు సాయంత్రం భార‌త పైల‌ట్ను తిరిగి అప్ప‌గిస్తామ‌ని పాక్ ప్ర‌క‌ట‌న చేసింద‌న్నారు. ఒక‌వేళ అదే జ‌రిగి ఉండ‌క‌పోతే.. ఆ రోజురాత్రి పాక్ పాలిట కాళ‌రాత్రి (ఖ‌త‌ల్ కీ రాత్) అయి ఉండేద‌న్న వ్యాఖ్య చేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అదే జ‌రిగి ఉంటే.. మోడీ అనే భార‌త ప్ర‌ధాని హ‌యాంలో పూడ్చుకోలేనంత న‌ష్టం జ‌రిగిందంటూ పాకిస్థానీయులు త‌మ భావిత‌రాల వారికి చెప్పుకునే ప‌రిస్థితి ఉండేద‌న్నారు.

తాను చెప్పేదంతా అమెరికా వాళ్లు చేసిన విశ్లేష‌ణ అని.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తానే అన్ని వివ‌రాల్ని ప్ర‌జ‌లకు చెబుతాన‌న్నారు. తాను ప్ర‌ధాని కుర్చీలో ఉన్నా.. లేకున్నా దేశ భ‌ద్ర‌త విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేద‌న్నారు. తానా?  ఉగ్ర‌వాదులా?  ఎవ‌రో ఒక‌రే ఉండాల‌నే ధ్యేయంతో గ‌త ఐదేళ్లుగా ఉగ్ర‌వాదంపై పోరాడుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. అందునా గుజ‌రాత్ లోనూ.. రాజ‌స్థాన్ లోనూ మోడీ నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లు ఎందుకు వ‌చ్చిన‌ట్లు?  ఎన్నిక‌ల ప్ర‌చారంలో పైలెట్ అభినంద‌న్ వ‌ర్ధ‌న్ ప్ర‌స్తావ‌న తేవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
 
Tags:    

Similar News