ఐఎస్‌ కు సినిమా చూపించే మొన‌గాడు

Update: 2015-11-23 09:39 GMT
హ‌జీ గాలిబ్ ముజాహిద్ పేరు ఎప్పుడైనా విన్నారా? తెలుగు మీడియాను ఫాలో అయ్యే వారికి ఈ పేరు కొత్త‌గా అనిపిస్తుంది. జాతీయ‌.. అంత‌ర్జాతీయ మీడియాను శ్ర‌ద్ధ‌గా ఫాలో అయ్యేవారికి మాత్రం ముజాహిద్ పేరు సుప‌రిచితం. ఇత‌గాడు ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లోకి నానుతున్నాడు. ప్ర‌పంచం మొత్తాన్ని త‌న ఉన్మాద చ‌ర్య‌ల‌తో వ‌ణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించే మొన‌గాడు ఎవ‌రైనా ఉన్నారంటే.. అందులో మొద‌ట‌గా వినిపించేది ముజాహిద్ పేరే. ఇత‌గాడి వ్య‌వ‌హారం చాలా చిత్రంగా ఉంటుంది. త‌నకు తాను తాలిబ‌న్ గా ప్ర‌క‌టించుకునే ఆయ‌న గురించి తెలుసుకునే వారికి కొత్త‌గా.. స‌రికొత్త‌గా.. కాస్తంత క‌న్ఫ్యూజింగ్ క‌నిపిస్తాడు.

అంత మంచోడే అయితే తాలిబ‌న్ కావ‌టం ఏమిట‌ని కొంద‌రు క్వ‌శ్చ‌న్ మార్క్ తో ప్ర‌శ్నిస్తుంటారు. తాలిబ‌న్ మాట విన్న వెంట‌నే అంద‌రికీ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ.. తాలిబ‌న్ అనే మాట‌కు ముజాహిద్ అస‌లుసిస‌లు అర్థం చెబుతాడు. అర‌బిక్ భాష‌లో తాలిబ‌న్ అనే మాట‌కు అర్థం.. జ్ఞానాన్ని అన్వేషించేవాడని. అయితే.. ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు తాలిబ‌న్ అంటే అర్థ‌మ‌య్యే అర్థ‌మేమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక‌.. ముజాహిద్ విష‌యానికి వెళితే.. అత‌న్ని అల్‌ ఖ‌యిదా ఉగ్ర‌వాదిగా భావించి అమెరిక‌న్లు అత‌డ్ని జైల్లో పెట్టారు.కానీ.. అత‌గాడికి ఆల్ ఖైదాకు సంబంధం లేద‌న్న విష‌యాన్ని వికీలీక్స్ బ‌య‌ట‌పెట్ట‌టంతో.. అత‌న్ని జైలు నుంచి విడుద‌ల చేశారు.

అయితే.. అత‌గాడు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి ఈ అప్ఘ‌న్‌ కి త‌న దేశంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో విస్తుపోయాడు. ఇస్లామిక్ స్టేట్ తోపాటు.. పాక్ కుతంత్రాల‌తో త‌మ దేశానికి ప‌ట్టిన పీడ‌ను వ‌దిలిస్తాన‌ని శ‌ప‌ధం చేసాడు. ఈ క్ర‌మంలో ఇస్లామిక్ స్టేట్ మీద నేరుగా తుపాకీ గురిపెట్టిన ముజాహిద్ కు భారీ న‌ష్ట‌మే జ‌రిగింది. 2013 రంజాన్ మాసం స‌మ‌యంలో అత‌ని కుటుంబ స‌భ్యులు 18 మందిని దారుణంగా హ‌త‌మార్చారు. తృటిలో ముజాహిద్ త‌న ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇత‌ని ఇంటిపై బాంబులు వేసిన క్ర‌మంలో.. బ‌య‌ట నిద్రిస్తున్న ఇత‌ను బ‌తికిపోయాడు. త‌న క‌ళ్ల ముందే త‌న పిల్ల‌లు చేసిన ఆర్త‌నాదాలు ముజాహిద్ మ‌ర్చిపోలేదు. ఆ గాయాలింకా ప‌చ్చిగా అత‌ని గుండెను మండేలా చేస్తున్నాయి.  అబ్బూ.. ఒళ్లు కాలిపోతుంది.. ర‌క్షించు అబ్బూ అంటే త‌న పిల్ల‌లు చ‌నిపోతూ చేసిన ఆర్త‌నాదాలు అత‌డి చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంటాయి.

త‌న‌కు.. త‌న దేశానికి తీర‌ని ద్రోహం చేసిన ఇస్లామిక్ స్టేట్ కు.. పాకిస్థాన్‌ కు బుద్ధి చెప్ప‌ట‌మే ధ్యేయంగా సాగుతుంటాడు. అఫ్గానిస్తాన్ లోని కొన్ని జిల్లాల్లో ఐఎస్ ప‌ట్టు సాధించిన నేప‌థ్యంలో.. ఆ మూక‌ల్ని త‌రిమి.. త‌రిమి కొట్టేందుకు అత‌గాడు ఇప్పుడు విప‌రీతంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న ద‌ళాల‌తో క‌లిసి.. తాను నేరుగా బ‌రిలోకి దిగ‌ట‌మే కాదు.. ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల గుండెల్లో బెదురు పుట్టేలా చేసే ముజాహిద్ పుణ్య‌మా అని.. అఫ్ఘానిస్తాన్ తూర్పు ప్రాంతంలోని ప‌లు ప్రాంతాలు ఐఎస్ ప‌ట్టు స‌డులుతోంది. ప్ర‌స్తుతం అచిన్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేస్తున్నా ఆయ‌న‌.. ఉద‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌టం.. మ‌ధ్యాహ్నం నుంచి తుపాకీ ప‌ట్టుకొని నేరుగా క‌ద‌న‌రంగంలోకి దూకి.. ఐఎస్ మూక‌ల్ని ఏరి పారేసే ప‌నిలో ఉంటారు.

పూర్తిగా కొండ‌లతో నిండిన ప్రాంతంలో ఇప్పుడు ముజాహిద్ కు తోడుగా అఫ్ఘ‌న్ సేన‌లే కాదు.. అమెరికా ద‌ళాలు జ‌త క‌లిశాయి. అత‌డు ఏ దిక్కు చూపిస్తే.. ఆ దిక్కుకు వెళ్లి బాంబులు వేసి వ‌స్తాయి. పాకిస్థాన్‌ ను విప‌రీతంగా ద్వేషించే ముజాహిద్‌.. ఆ దేశం గురించి చెబుతూ పాక్ ఒక పాము అని.. ఒకే మ‌త‌స్తుల‌పైనే కుట్ర‌లు చేస్తుంద‌ని.. ఆ దేశంతోఎట్టి ప‌రిస్థితుల్లో చేతులు క‌ల‌పొద్ద‌ని బ‌లంగా చెబుతుంటాడు. పాక్ ను ఇంత‌గా ద్వేషించే ముజాహిద్ ఒక‌ప్ప‌టి ప్రాణ స్నేహితుడు ఎవ‌రో కాదు.. ఐఎస్‌ కు ప్రస్తుతం నేతృత్వం వ‌హిస్తున్న అబ్దుల్‌ ర‌హీమ్. ఒక‌ప్పుడు వీరిద్ద‌రూ ర‌ష్యాకు వ్య‌తిరేకంగా అమెరికా త‌ర‌ఫున పోరాడారు. కాక‌పోతే.. త‌ర్వాత కాలంలోఇద్ద‌రి దారులు ఏక‌మ‌య్యాయి. త‌న ఒక‌ప్ప‌టి ప్రాణ‌మిత్రుడు త‌ప్పు దారి ప‌ట్టాడ‌ని ముజాహిద్ చెబుతుంటాడు. చేత ఏకే 47 రైఫిల్ ప‌ట్టుకొని.. క‌ద‌న‌రంగంలోకి దూకాడ‌టంటే.. అఫ్ఘ‌న్ సైనికులే కాదు.. అమెరికన్ సైనికుల‌కు పెద్ద అండ‌గా భావిస్తుంటారు.
Tags:    

Similar News