మోడీజీ...మీరు గెలిచారు

Update: 2016-08-21 09:36 GMT
బలూచిస్తాన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ద‌క్కుతుంది. ముఖ్యంగా ఈ ముస్లిం దేశం గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆ పొరుగునే ఉన్న ఆఫ్గనిస్తాన్ స్వాగ‌తించ‌డం ఆస‌క్తిక‌రం. ఆప్ఘ‌నిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మోడీ వ్యాఖ్య‌ల‌ను సమర్థించారు.  స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి మోడీ మాట్లాడుతూ బలూచిస్తాన్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందంటూ మోడీ వ్యాఖ్య నించారు. ఆయన వ్యాఖ్యలతో పాక్‌లో ప్రకంపనలు చెలరేగిన సంగతి విదితమే. ఈ నేప‌థ్యంలో హమీద్ కర్జాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ - మోడీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు - ఆయనను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు.

ఇండియా శాంతి దేశమని - పరోక్ష యుద్ధానికి అది ఎప్పుడూ కాలు దువ్వదని కితాబిచ్చారు.ఉగ్రవాదం కోసం పాకిస్తాన్ కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదం కారణంగానే కాశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారుతోందని కర్జాయ్ మండిప‌డ్డారు. తీవ్ర‌వాదం ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందో తమకు తెలుసని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి అన్నారు. భారత్ నుంచి రక్షణ సామగ్రిని ఆఫ్గనిస్తాన్ కోరుకుంటోందని తెలిపారు. సామర్థ్యాన్ని మరింత పెంచే విషయంలో భారత్ సాయం అవసరమని కర్జాయ్ పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా....బలూచిస్తాన్ శరణార్థి 25 ఏళ్ల మజ్దక్ దిల్షాద్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని పొగుడుతూ  త‌మ పొరుగుదేశమైన పాకిస్తాన్‌ గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవ‌లే దిల్షాద్ త‌న భార్యతో కలిసి న్యూఢిల్లీకి వచ్చాడు. అయితే, తన పాస్‌ పోర్ట్‌ లో తన జన్మస్థలం పాకిస్తాన్‌ లోని క్వెట్టా అని ఉంది. దీంతో ఎయిర్‌ పోర్ట్‌ లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ విషయమై మజ్దక్‌ ను ప్రశ్నించారు. తమను ఎన్నో బాధలు పెడుతున్న పాకిస్తాన్‌ లో తాను పుట్టినట్లు అనుమానిస్తుండడంతో మజ్దక్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పాకిస్తానీ కాదనే విషయాన్ని వివరించే క్రమంలో తాను ఆవేదన చెందినట్లు మీడియాకు తెలిపాడు. తనను కుక్క అని అయినా పిలవండి కానీ, పాకిస్తానీ అని మాత్రం అనవద్దని అధికారులతో అన్నట్లు ఆయ‌న వివ‌రించాడు. తాను బలూచ్ వాసినని, తాను అక్కడ పుట్టినందుకు ఎన్నో వేధింపులకు గురయినట్లు తెలిపాడు.

బలూచిస్తాన్‌ కు చెందిన వేల మంది ప్రజలు విదేశాలకు తరలివెళ్లారు. బలూచిస్తాన్ వాసులని పాకిస్తాన్ ఆర్మీ వేధింపులకు గురిచేస్తోంది. మజ్దక్ తండ్రిని కూడా అపహరించి చంపేసింది. అతని తల్లిని కూడా ఎన్నో రకాలుగా హింసించింది. వేధింపులు తట్టుకోలేక మజ్దక్ కెనడాకు వెళ్లిపోయాడు. బలూచిస్తాన్‌ లో స్వాత్రంత్యం కోసం జరుగుతున్న పోరాటంపై అవగాహన కల్పించే క్రమంలో ఇటీవలే ఆయన కెనడా నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నాడు.ఈ క్రమంలో ఆయన ఇలా ఆవేదన వ్యక్తం చేశాడు. బలూచిస్తాన్ - పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో జరుగుతున్న ఘోరాలపై మాట్లాడినందుకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపాడు. తాను పుట్టిన దేశంలో పాక్ ఆర్మీ జాతుల నిర్మూలనకు పాల్పడుతోందని ఆయన చెప్పాడు. బలూచిస్తాన్ వాసులను పాక్ జాతీయతను ఒప్పుకోవాలని ఆర్మీ బలవంతపెడుతోందని, వారి పై దాడులకు దిగుతూ చంపేస్తోందని ఆయన పేర్కొన్నాడు.
Tags:    

Similar News