సీట్ల పెంపునకు మరోసారి ‘నో ’

Update: 2016-11-30 03:56 GMT
తెలుగు రాష్ట్రాల్ని పాలిస్తున్న ఇద్దరు చంద్రుళ్లకు ఇది చేదువార్తే. భవిష్యత్తు మీద కోటి ఆశలతో జంపింగ్స్ ను ప్రోత్సహించేందుకు కారణమైన సీట్ల పెంపు అంశంపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. వారి ఆశల మీద నీళ్లు చల్లింది. విభజన చట్టంలో పేర్కొన్న తీరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకునేందుకు వీలు ఉందంటూ పేర్కొంది.

ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్ని.. 153 సీట్లకు.. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లను225 సీట్లకు పెంచుకునేలా అవకాశాన్నికల్పిస్తూ విభజన చట్టంలోని పేర్కొంది. అయితే.. ఆర్టికల్ 170(3)సెక్షన్ ప్రకారం సీట్ల పెంపు సాధ్యం కాదని.. 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారమే సీట్లను పెంచుకోవాలని రాజ్యాంగంలో ఉందన్న వాదనను కేంద్రం వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. తాజాగా లోక్ సభలోనూ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని మరోసారి తేల్చేసింది. టీఆర్ ఎస్ ఎంపీలు నర్సయ్య గౌడ్.. ప్రభాకర్ రెడ్డిలు వేసిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం సమాధానమిస్తూ.. సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చారు.

కేంద్రం చేస్తున్న వాదనకు భిన్నంగా టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర హోంశాఖా మంత్రికి ఇటీవల ఒక లేఖ రాశారు. దీని ప్రకారం విభజన చట్టంలోని సెక్షన్  26కు చిన్న మార్పు చేయటం ద్వారా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనపై కేంద్ర హోం శాఖ తర్జనభర్జనలు పడుతుందని చెబుతున్నా.. సీట్ల పెంపుతో కేంద్రంలోని బీజేపీకి ఎలాంటి లాభం కలగదన్నది బహిరంగ రహస్యం. సీట్ల పెంపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు మరింత బలపడతాయన్నది తెలిసిందే. చూస్తూ.. చూస్తూ.. రెండు ప్రాంతీయ పార్టీలు బలపడేందుకు వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్న సందేహం వినిపిస్తున్న వేళ.. సీట్ల పెంపు సాధ్యం కాదన్న మాట పదే పదే వినిపించటం చూస్తే.. కేంద్రం వైఖరిని ఏమిటన్నది చెప్పకనే చెప్పేసినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News