'ఛలో నబన్నా' లో సిక్కులకు ఘోర అవమానం ... హర్భజన్ తో సహా భగ్గుమన్న సిక్కులు , చర్యలకి డిమాండ్ !

Update: 2020-10-10 15:30 GMT
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేతల హత్యలకి నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ చేపట్టిన 'ఛలో నబన్నా' ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని సిక్కులు ఆరోపిస్తున్నారు. నిరసనలో పాల్గొన్న ఓ సిక్కు సోదరుడి 'టర్బన్'(తలపాగా) ను ఓ పోలీస్ అధికారి లాగేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మనీష్ శుక్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. గతంలోనూ రాష్ట్రంలో పలువురు బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురవడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యల వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఈ క్రమంలో శుక్రవారం సచివాలయ ముట్టడికి 'ఛలో నబన్నా' ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది.

ఆ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. 43 ఏళ్ల బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి 'టర్బన్' ను ఓ పోలీస్ అధికారి లాగి పడేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ‌గా మారాయి. టర్బన్'ను లాగి పడేసి సిక్కుల మత విశ్వాసాల పట్ల అనుచితంగా వ్యవహరించిన సదరు పోలీస్ అధికారిపై సిక్కు వర్గం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ , క్రికెటర్ హర్భజన్ సింగ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్‌ ద్వారా మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు బెంగాల్ పోలీసులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. బల్వీందర్ సింగ్ టర్బన్‌ ను తాము తొలగించలేదని, ఘర్షణ క్రమంలో దానికదే ఊడిపోయిందని అన్నారు. మత విశ్వాసాలను,మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదన్నారు. సింగ్ వద్ద నుంచి పోలీసులు 9 ఎంఎం గన్ ‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా గన్ వాడుతున్నందుకు అతనిపై భారతీయ ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ రాజౌరికి చెందిన మాజీ సైనికుడిగా అతన్ని గుర్తించారు. అయితే బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మాత్రం బల్వీందర్ సింగ్ ఓ బీజేపీ నేత వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ నేత ఫిర్హద్ హకీం మాట్లాడుతూ... పొలిటికల్ ర్యాలీల్లో బాంబులు, గన్స్‌ ఉపయోగించడం మేమెప్పుడూ చూడలేదు. మీరు ర్యాలీల్లో గన్స్ వాడినప్పుడు పోలీసులు తమ పని తాము చేయాల్సిందే... అని తెలిపింది.
Tags:    

Similar News