తగ్గేది లేదు.. కావాలంటే చంపేసుకోండి

Update: 2015-10-15 10:15 GMT
దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి నోటి నుంచి ఒక రిక్వెస్ట్ రావాలే కానీ.. దాన్ని ఓకే అనటానికి చాలామంది సందేహించరు. కాస్త ఇబ్బంది అయినా.. ఓకే అనేస్తారు. అలాంటిది అందుకు భిన్నమైన అనుభవం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎదురైంది. మొండోడు రాజు కంటే బలవంతుడనే సామెతను నిజం చేస్తూ.. అమిత్ షాకు షాక్ ఇచ్చిన వైనం ఇప్పుడు చర్చగా మారింది.

ప్రధాని సొంత రాష్ట్రానికి చెందిన గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ హార్దిక్ పటేల్ ఉద్యమంలోకి రావటం.. దాన్ని ఓ రేంజ్ లోకి తీసుకెళ్లి.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడేలా చేయటం తెలిసిందే. తన నిరసన ప్రదర్శనలతో దేశ ప్రజల దృష్టికి ఆకర్షించిన హార్దిక్ పటేల్ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు.

పటేళ్లకు రిజర్వేషన్ల విషయంపై ఆందోళనను విరమించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. దీనికి బదులిచ్చిన హార్దిక్ పటేల్ అలాంటి అవకాశమే లేదని తేల్చి చెప్పటమే కాదు.. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ అది సాధ్యం కాదని తేల్చేశాడు. అంతేకాదు.. కాస్త ఘాటుగా రియాక్ట్ అయిన హార్దిక్.. అవసరమైతే మీ బలగాలతో దాడి చేయించి నన్ను చంపేయండి. . నేను చనిపోయినా నాలాంటి వారు ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతారంటూ వ్యాఖ్యనించాడు. ఉద్యమాన్ని ఆపమని చెప్పే కన్నా.. తమ డిమాండ్లను తీరిస్తే సరిపోతుంది కదా అంటూ అమిత్ షా నోట వెంట మాట రాకుండా చెప్పేశాడు. హార్దిక్ మాటలు వింటే.. ఎందుకు కదిలించుకున్నానురా బాబు అని అమిత్ కూడా అనుకొని ఉంటారేమో.
Tags:    

Similar News