హార్థిక్‌ ప్ర‌క‌ట‌న కాంగ్రెస్‌ కు జోష్ నిచ్చిందే!

Update: 2017-11-22 09:52 GMT
గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న‌ కాంగ్రెస్ కు ఊహించ‌ని ఉప‌శ‌మ‌నం ల‌భించింది.  22 ఏళ్ల‌ బీజేపీ అప్ర‌తిహ‌త‌ ప‌రిపాల‌నకు గండి కొట్టాల‌ని భావిస్తున్న హ‌స్తంపార్టీ.. ఈ క్ర‌మంలో పొత్తుల కోసం చిన్న పార్టీల‌కూ స్నేహ‌హ‌స్తం చాచేందుకు సిద్ధ‌మైంది.  అందులో భాగంగానే హార్దిక్‌ పటేల్ నేత‌ృత్వంలోని పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితితో పొత్తు కుదుర్చుకుంది. అయితే ఆ త‌ర్వాత త‌లెత్తిన ప‌రిణామాల‌తో ఆ పార్టీకి ఊహించ‌ని చిక్కులెదుయ్యాయి. ప్ర‌స్తుతం ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌వ‌డంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఫుల్ జోష్‌ లో ఉంద‌ట‌.

గుజ‌రాత్ లో కాంగ్రెస్‌-పటీదార్ అన‌మ‌త్ ఆందోళ‌న్ స‌మితి (పీఏఏఎస్ ) పొత్తు ప్రకటన వెలువడిన కాసేపటికే పరిస్థితులు తారుమారయ్యాయి. మొత్తం 77 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అందులో కేవలం మూడు స్థానాలను మాత్ర‌మే పటేల్‌ వర్గానికి కేటాయించింది. దీంతో టికెట్ల కేటాయింపుపై చిచ్చు రాజుకుంది. సూరత్‌ - అహ్మదాబాద్‌ లో పీఏఏఎస్‌ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టింది. సూరత్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పటేల్‌ వర్గీయులు-కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్‌ ను పూర్తిగా ధ్వంసం చేశారు.

తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకున్నట్లు పటీదార్‌ ఉద్యమ నేత హర్ధిక్‌ పటేల్‌ బుధవారం ప్రకటించారు. గుజరాత్‌ లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్లు తెలిపారు. సెక్షన్‌ 31 - సెక్షన్‌ 46 కింద పటీదార్లను బీసీల్లో చేర్చడానికి  ఒప్పకుందని వెల్లడించారు. గుజరాత్‌ లో అధికారం చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ పటీదార్ల రిజర్వేషన్లకు ఓ బిల్లును తీసుకొస్తుందని హార్థిక్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని తాము టికెట్లు కోరలేదని వెల్లడించారు. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితిలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాల‌ని ఇంతవరకూ తాము ఎవరినీ కోరలేదని చెప్పారు. అది ప్రజలకే వదిలేస్తున్నామని అన్నారు.

అంతేకాకుండా ఉత్తర గుజరాత్‌ లో పీఏఏఎస్‌ కు చెందిన పలువురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ పలుమార్లు ప్రయత్నించిందని, రూ.50 లక్షలు ఎర వేసింద‌ని కూడా హార్థిక్‌ ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి పనులకు దిగుతోందని విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదంటూ ఆయ‌న స్ప‌ష్టంచేశారు. పటీదార్ల రిజర్వేషన్లను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని, ఆ పార్టీని ఓడిస్తామ‌ని వెల్ల‌డించారు. పొత్తు ప్ర‌క‌ట‌న అనంత‌ర ఫ‌లితాల‌తో ఆందోళ‌న‌లో ఉన్న గుజ‌రాత్ కాంగ్రెస్ నేత‌ల‌కు హార్థిక్ ప్ర‌క‌ట‌న నిజంగా ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News