అదరగొడుతున్న ‘‘ఈదర’’ గాంధీ గిరి

Update: 2015-12-29 04:36 GMT
తప్పు చేస్తే ఒప్పుకునే సత్యకాలం పోయి చానాళ్లే అయ్యింది. చేసింది తప్పు అని న్యాయస్థానాలు తేల్చినా.. దానికి ఏదో ఒక వాదాన్ని అంటగట్టి తప్పించుకోవాలన్న దరిద్రపు కాలం ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటి సమయంలో రాజకీయ నేతలు వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం చాలామంది చేసేదే. ఇలాంటి వాటి విషయంలో అడ్డంగా దొరికిపోయినా బుకాయించి తప్పించుకోవటం సమకాలీన రాజకీయాల్లో కనిపించేదే.

దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు. ఆ మధ్యన ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నానంటూ.. ఎండలో నిలుచొని తనకు తాను శిక్ష విధించుకొని వార్తల్లోకి వచ్చారు. ఒక రాజకీయ నేతకు.. అందులో పదవిలో ఉన్న ఒక నేత ఇంత సున్నితంగా వ్యవహరిస్తారా? అని ఈదర హరిబాబు గురించి తెలిసి పలువురు విస్మయం చెందారు.

తాజాగా.. ఆయన మరోసారి ఇలాంటి తరహా పనే చేసి వార్తల్లోకి వచ్చారు. సోమవారం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం జడ్పీ హైస్కూల్ కు ఆయన వెళ్లారు. ఉదయం 9.40 గంటలకు ఆయన వెళితే.. పాఠశాలలో మొత్తం 15 మంది ఉపాధ్యాయులకు కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ప్రేయర్ ముగిసిన తర్వాత హెచ్ ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు వస్తే.. మిగిలిన ఐదుగురు అసలు బడికే రాని పరిస్థితి. దీంతో సీరియస్ అయిన ఆయన.. వారి హాజరు పట్టిక మీద తన అభిప్రాయాన్ని రాసిన ఈదర హరిబాబు టీచర్లు చేసిన తప్పునకు తనకు తానే శిక్ష విధించుకున్నారు.

స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఎదుట 10 నిమిషాలు ఎండలో నిలుచొన్నారు. టీచర్ల అలసత్వంపై తనకు తాను స్వీయ శిక్ష విధించుకున్న ఆయన వైఖరి టీచర్లకు వణుకు పుట్టించింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలోచించేలా ఉన్నాయి. కర్ణాటకలో ఉపాధ్యాయులకు జీతాలు రిటైర్ అయ్యే నాటికి రూ.40వేల మించవని..కానీ.. ఏపీలో మాత్రంరూ.80 నుంచి రూ.90 వేల వరకు ఉన్నాయని.. అంత జీతం తీసుకుంటున్నప్పుడు అంతే బాధ్యతగా పని చేయాలని వ్యాఖ్యానించారు. తనదైన గాంధీగిరితో ఈదర హరిబాబు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పక తప్పదు.   
 
Tags:    

Similar News