హరీష్ ‘మెజారిటీ చాలెంజ్’.. కేటీఆర్ ను ఓడిస్తాడా?

Update: 2019-03-25 10:24 GMT
బకెట్‌ చాలెంజ్‌ లా ఇప్పుడు టీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు.. 'మెజారిటీ చాలెంజ్‌'ను తన మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో తీసుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు టార్గెట్‌ లను విధించారు. కేటీఆర్‌ ను ఎలాగైనా ఓడగొట్టాలన్న ఉద్దేశంతో విసిరిన 'మెజారిటీ చాలెంజ్‌' ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే కేటీఆర్‌ ను ఎన్నికల్లో ఓటమి పాలు చేయడం కాదు.. మెజారిటీ విషయంలో కేటీఆర్‌ కంటే ఎక్కువ తెచ్చుకోవడం.. ఇలా బావ, బామ్మర్దుల మధ్య విసిరిన సవాళ్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు వస్తున్నాయి. ఇంతకీ హరీశ్‌ రావు, కేటీఆర్‌ ల మధ్య ఈ గెలుపోటముల విషయం ఎందుకు వచ్చింది.

ఏప్రిల్‌ 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ విజయం సాధించే దిశగా పార్టీ అధినేత కేసీఆర్‌ తో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ ఎస్‌ గాలి వీచేట్లు స్కెచ్‌ లు వేసిన టీఆర్‌ ఎస్‌ నేతలు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ 16 స్థానాల్లో గెలవాలని కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.

ఈ నేపథ్యంలో బెట్టింగుల పర్వం ముందుకొచ్చింది. అయితే ఈ బెట్టింగుల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని ఎవరూ పందేలు కాయడం లేదట..కేటీఆర్-హరీష్ లు తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కువ మెజారిటీ సాధిస్తారనే విషయంలోనే బెట్టింగ్ లు తెలంగాణలో భారీగా కాస్తున్నారట.. ఈనెల 8వ తేదీన సిద్ధిపేటలో నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహాక సభలో హరీశ్‌ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మెదక్‌ ఎంపీని గెలిపించుకొని కేసీఆర్‌ కు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇదే వేదికపై ఉన్న కేటీఆర్‌ మాట్లాడుతూ మెదక్‌ ఎంపీ అభ్యర్థి కంటే కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి రెండు ఓట్లు ఎక్కువే తెచ్చి హరీష్ కు గిఫ్ట్‌గా ఇస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు.. అయితే తాజాగా సోమవారం జరిగిన మరోసభలో హరీశ్‌ రావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడే ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధిపేటలో కంటే దుబ్బాకలోనే అత్యధిక మెజారిటీ ఇస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఎంపీల గెలుపు బాధ్యతను కేసీఆర్ సీనియర్ ఎమ్మెల్యేల మీద పెట్టారు. కరీంనగర్ ఎంపీ బాధ్యత కేటీఆర్ కు.. మెదక్ ఎంపీ బాధ్యతను హరీష్ రావుపై పెట్టారు. ఈ నేపథ్యంలోనే హరీష్ తన పరిధిలో ఎమ్మెల్యేలకు ఇప్పుడు ‘మెజారిటీ’ చాలెంజ్ విసిరాడు.  తామంటే తాము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఛాలెంజ్‌ చేస్తున్నారు. అయితే ఆయా చోట్ల హరీశ్‌ రావు పాల్గొన్న సభలోనే ఇలా ఎమ్మెల్యేలు కేటీఆర్ కు పరోక్ష ఛాలెంజ్‌ లు విసరడం చర్చనీయాంశంగా మారింది.
    
    
    

Tags:    

Similar News